Wayanad Landslide: భారీ వర్షాల కారణంగా కేరళలోని వయనాడ్ జిల్లాలో విరిగిపడ్డ కొండచరియలతో వందల మంది కకాలవికలమైపోయారు. వారు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండక్కై పట్టణం, చురాల్ మాల ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున ఈ ప్రమాదాలు జరిగింది. కొండచరియలు విరిగిపడ్డ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్టు లోకల్ మీడియా చెబుతుంటే... ఒక చిన్నారితో సహా నలుగురు మరణించినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. 


అర్థరాత్రి ముంచుకొచ్చిన ప్రమాదం 


కొండచరియలు విరిగిపడ్డ ప్రమాదంలో గాయపడిన 50 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారీ వర్షాల సమయంలో ముండక్కై పట్టణంలో తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ముండక్కై చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేస్తున్న టైంలోనే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో చురల్ మాలలోని పాఠశాల సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వరద బాధితుల శిబిరం ఉన్న  పాఠశాల, సమీపంలోని ఇళ్లు, దుకాణాలపై కొండచరియలు ముంచెత్తాయి.  దీంతో ఆ ప్రాంతమంతా నీరు, బురదతో నిండిపోయింది. అక్కడకు కొన్ని బృందాలు వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 






 


హెల్ప్ లైన్ నంబర్ జారీ
అత్యవసర సమాచారం కోసం హెల్ప్ లైన్ నంబర్లు జారీ చేశామని, సహాయక చర్యల కోసం వైమానిక దళాన్ని రంగంలోకి దించామని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. భారీ వర్షాల కారణంగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయని పేర్కొంది. జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్‌ను ఓపెన్ చేశారు. అత్యవసర సహాయం కోసం 9656938689, 8086010833 హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారు. రెండు ఐఏఎఫ్ హెలికాప్టర్లు మిగ్‌-17, ఒక ఏఎల్‌హెచ్‌ను రంగంలోకి దించినట్టు అధికారులు పేర్కొన్నారు. 


ఆస్పత్రులు అప్రమత్తం చేసిన వైద్యార్యోగశాఖ 
రోగులకు చికిత్స కోసం అన్ని ఆసుపత్రులను అప్రమత్తం చేసినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వందల మంది చిక్కుకున్న వేళ అత్యవసర ఆరోగ్య కేంద్రాల కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. వర్తిరి, కల్పత్త, మేప్పాడి, మనంతవాడి ఆసుపత్రులతో సహా అన్ని ఆసుపత్రులు రోగులకు చికిత్స చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. రాత్రీపగలు సేవలు చేసేందుకు ఆరోగ్య కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. వయనాడ్‌ కూడా ఆరోగ్య కార్యకర్తల బృందాలు మోహరించనున్నట్లు పేర్కొన్నారు. 






శిథిలాల కింద వందలాది మంది: కేఎస్డీఎంఏ
కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో అగ్నిమాపక దళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యలు కొనసాగిస్తున్నాయి. జోరుగా కురుస్తున్న వర్షాల వల్ల చర్యలకు అంతరాయం ఏర్పడుతుందని కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (కేఎస్డీఎంఏ) పేర్కొంది. సహాయక చర్యల్లో సహాయపడటానికి కన్నూర్ డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్‌స్‌కు చెందిన రెండు బృందాలను వయనాడ్కు తరలించినట్లు కెఎస్డిఎంఎ సమాచారం ఇచ్చింది. కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది శిథిలాల కింద ఉన్నారని స్థానికులు చెప్పినట్టు అధికారులు వివరించారు.