Kalamassery Blast:


పోలీసుల ఎదుట లొంగిపోయిన వ్యక్తి..


కేరళ పేలుళ్ల ఘటనలో (Kerala Kalamassery Bomb Blast) కీలక పరిణామం జరిగింది. త్రిసూర్‌కి చెందిన ఓ వ్యక్తి ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 48 ఏళ్ల డామినిక్ మార్టిన్ ( Dominic Martin) తానే కన్వెన్షన్ సెంటర్‌లో బాంబు పెట్టినట్టు అంగీకరించాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. దీనిపై కలమస్సెరీ ADGP ఎమ్ఆర్ అజిత్ కుమార్ స్పందించారు. 


"కొడకర పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి లొంగిపోయాడు. తనే ఈ బాంబు పెట్టినట్టు చెప్పాడు. అతని పేరు డామినిక్ మార్టిన్. సభా గ్రూప్‌కి చెందిన వ్యక్తినేనని చెప్పాడు. పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. ఈ కేసుకి సంబంధించి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నాం. హాల్‌ మధ్యలో ఈ పేలుడు సంభవించినట్టు గుర్తించాం"


- ఎమ్ఆర్ అజిత్ కుమార్, కలమస్సెరీ ADGP






స్పష్టతనివ్వని పోలీసులు..


అయితే...ఈ పేలుళ్ల వెనక ఉన్నది ఆ వ్యక్తేనా కాదా అన్నది మాత్రం పోలీసులు ఇంకా స్పష్టంగా చెప్పలేదు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక విచారణ ఆధారంగా చూస్తే...టిఫిన్‌ బాక్స్‌లో IED పెట్టి పేల్చినట్టు తేలింది. ఉదయం 9.40 నిముషాలకు తొలి పేలుడు సంభవించింది. 


ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారంటే..?


ఈ పేలుళ్లలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం 40 మందికి పైగా గాయపడ్డారు. తీవ్రత పరంగా చూస్తే తక్కువగానే అనిపించినప్పటికీ...వరుసగా ఒకే చోట మూడు పేలుళ్లు సంభవించడం (Kerala Blast News) కలకలం రేపింది. ఎర్నాకులంలోని కలమస్సెరీ కన్వెన్షన్ హాల్‌లో ఈ పేలుళ్లు (Kalamassery Blast) సంభవించాయి. ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనను తలుచుకుని ఆందోళనకు లోనవుతున్నారు. ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించిందని, అంతలోనే మంటలు వ్యాపించాయని చెబుతున్నారు. పేలుడు ధాటికి హాల్ అంతా పొగ కమ్ముకుందని వివరించారు. 


"సరిగ్గా హాల్‌ మధ్యలోనే పేలుడు సంభవించింది. మూడు సార్లు గట్టిగా శబ్దాలు వినిపించాయి. నేను వెనకాల ఉన్నాను కాబట్టి నాకేమీ కాలేదు. కానీ విపరీతంగా పొగ కమ్ముకుంది. ఓ మహిళ చనిపోయిందని అందరూ అనుకుంటుంటే విన్నాను. ఈ హాల్‌కి మొత్తం 6 ఎంట్రీ, ఎగ్జిట్ గేట్‌లున్నాయి. పేలుడు శబ్దం వినిపించిన వెంటనే అందరూ ఎవరి దారిలో వాళ్లు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేశారు. మంటలు పూర్తిగా వ్యాపించకపోవడం వల్ల ప్రమాదం తప్పింది"


- ప్రత్యక్ష సాక్షి


Also Read: Kochi Blast: కేరళ పేలుడు ఘటనపై ఎన్ఎస్ జీ బృందం దర్యాప్తు - ఉగ్ర దాడి అనుమానాలపై విచారణ