Karnataka Syllabus:


సిలబస్ నుంచి తొలగింపు..


కర్ణాటక ప్రభుత్వం RSS ఫౌండర్ కేబీ హెడ్గేవర్ ( KB Hedgewar) పాఠాన్ని స్కూల్ సిలబస్ నుంచి తొలగిస్తున్నట్టు ఈ మధ్యే వార్తలు వచ్చాయి. దీనిపై సిద్దరామయ్య త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప కీలక ప్రకటన చేశారు. స్కూల్ సిలబస్ నుంచి కేబీ హెడ్గేవర్ లెసన్‌ని తొలగిస్తున్నట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం సిలబస్‌లో చేసిన మార్పులన్నింటినీ తొలగించి పాత సిలబస్‌నే కొనసాగించనున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయమూ తీసుకుంది సిద్దరామయ్య సర్కార్. భారత రాజ్యాంగంలోని పీఠికను అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు చదవాలని ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ మీటింగ్‌లో విద్యాశాఖ మంత్రితో చర్చించిన సిద్దరామయ్య...టెక్స్ట్‌బుక్స్ రివిజన్‌కీ మొగ్గు చూపారు. త్వరలోనే ఈ నిర్ణయాన్నీ అమల్లోకి తీసుకురానున్నారు. దీంతో పాటు మత మార్పిడి నిరోధక చట్టాన్నీ (Anti-Conversion Law) తొలగించింది ప్రభుత్వం. ఇలాంటి చట్టాలతో ఎలాంటి ప్రయోజనం లేదని సిద్దరామయ్య తేల్చి చెప్పారు. 


"RSS వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవర్‌ పాఠాన్ని స్కూల్ సిలబస్ నుంచి తొలగిస్తున్నాం. గత ప్రభుత్వం సిలబస్‌లో మార్పులేవైనా సరే..వాటన్నింటినీ తొలగించి మళ్లీ పాత సిలబస్‌నే కంటిన్యూ చేస్తాం"


- మధు బంగారప్ప, కర్ణాటక విద్యాశాఖ మంత్రి 






ఈ నిర్ణయంపై విద్యాశాఖ మాజీ మంత్రి బీసీ నగేశ్ స్పందించారు. సిద్దరామయ్య ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అని విమర్శించారు. ముస్లిం ఓట్ల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని మండి పడ్డారు. 


"వాళ్లకు (కాంగ్రెస్‌కి) ముస్లిం ఓట్లు కావాలి. సిద్దరామయ్య ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకం అని స్పష్టంగా అర్థమైంది. బహుశా వాళ్లు త్వరలోనే హిజాబ్‌ని కూడా అమల్లోకి తీసుకొస్తారేమో. ఏదో విధంగా మైనార్టీలకు దగ్గరవ్వాలని ఇలా చేస్తున్నారు. ప్రతి దాన్నీ రాజకీయం చేస్తున్నారు"


- బీసీ నగేశ్, కర్ణాటక మాజీ మంత్రి