Karnataka Elections 2023: కర్ణాటకలో రాజకీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాల రూప‌క‌ల్ప‌న‌లో మునిగిపోయాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 13న నోటిఫికేషన్ రానుంది. మే 10న ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. అధికార బీజేపీ ఇవాళ తొలి జాబితా విడుద‌ల చేస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగినా, చివ‌ర‌కు వాయిదా ప‌డింది.


క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు సంబంధించి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను మంగళవారం లేదా బుధవారం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. జాబితా ఖరారు విషయంలో ఎలాంటి గందరగోళం లేదని ఆయ‌న‌ స్పష్టం చేశారు. 224 మంది సభ్యుల అసెంబ్లీకి అభ్యర్థుల తొలి జాబితాను సోమ‌వారం సాయంత్రంలోగా విడుదల చేస్తామని మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. అయితే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాబితాపై మ‌రింత స్ప‌ష్ట‌త ఇవ్వాల్సి ఉందని, త్వరలోనే జాబితా విడుద‌ల‌ అవుతుందని బొమ్మై వెల్ల‌డించారు. 


రాష్ట్రంలో 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌మ‌ల ద‌ళంలో ఎడ‌తెగ‌ని చర్చలు జరుగుతున్నాయి. సోమ‌వారం ఉదయం జరిగిన సమావేశంలో శ్రీ‌ఘ్ర స‌మ‌న్వ‌యం కోసం పార్టీ నేత‌ల‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప‌లు మార్గదర్శకాలు సూచించారు. తొలి జాబితాలో దాదాపు 170 నుంచి 180 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటిస్తుంని ప్ర‌చారం జ‌రుగుతోంది. యడియూరప్ప తనయుడు విజయేందర్ శికారిపూర్ నుంచి పోటీ చేయనున్నారు.


మ‌రోవైపు.. శివమొగ్గలోని "కమలం ఆకారంలో" ఎయిర్‌పోర్ట్ టెర్మినల్, రాష్ట్రంలోకి అమూల్ ప్రవేశంపై వివాదం కర్ణాటక  రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. కమలం ఆకారంలో ఉన్న శివమొగ్గ విమానాశ్రయం టెర్మినల్‌ను ఎన్నికలు ముగిసే వరకు కప్పి ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ కోరింది. రాష్ట్రంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎమ్‌ఎఫ్)  'నందిని ' పేరుతో ఉత్పత్తులను విక్రయిస్తున్న స‌మ‌యంలో అమూల్ రాక‌పై ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.


కర్నాటక ఎన్నికలకు గ‌డువు స‌మీపిస్తున్న‌ కొద్దీ, రాష్ట్రంలోకి అమూల్ సంస్థ‌ ప్రవేశంపై రాజకీయ వివాదం రాజుకుంటోంది. ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రిని ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌ల దాడిని పెంచుతున్నాయి. సహకార సంఘాల‌ను, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎమ్‌ఎఫ్) ధ్వంసం చేసే ల‌క్ష్యంతోనే రాష్ట్రంలోకి అమూల్‌ను అనుమ‌తించారంటూ ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. క‌ర్ణాట‌క‌లో అమూల్ ప్ర‌వేశాన్ని “గుజ‌రాత్ చొర‌బాటు”గా మాజీ ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య అభివ‌ర్ణించారు.
“గుజరాత్‌కు చెందిన అమూల్ మన రాష్ట్రంలోకి ప్రవేశించడంతో నందిని డిమాండ్ మరింత పడిపోతుంది, KMF నిల్వ మరింత తగ్గుతుంది. పాడి పరిశ్రమ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రైతులను దెబ్బతీయడానికి ఎందుకు  ప్రయత్నిస్తున్నారు నరేంద్ర మోదీజీ?” అని ఆయ‌న‌ ట్వీట్ చేశారు.






కర్ణాటకలో అమూల్, కేఎంఎఫ్‌లను విలీనం చేయాలనే ఆలోచనను హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన వెంటనే రాష్ట్ర బ్రాండ్ నందిని ఉత్పత్తులు మార్కెట్ నుంచి వేగంగా కనుమరుగవుతున్నాయని, ఇది రాష్ట్రంలో అసాధారణ పరిణామమని సిద్ధరామయ్య ఆరోపించారు.