ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్ ను జాతీయ హోదా పార్టీకి గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో మూడు జాతీయ హోదా పార్టీలకు ఈసీ షాకిచ్చింది. సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీ పార్టీలు జాతీయ పార్టీ హోదా కోల్పోయినట్లు తెలిపింది. 






లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నాగాలాండ్ లో రాష్ట్ర పార్టీగా ఈసీ గుర్తించింది.
తిప్రా మోతా పార్టీ త్రిపురలో రాష్ట్ర పార్టీగా ఈసీ గుర్తింపు పొందింది.
బీఆర్ఎస్ పార్టీని ఏపీలో రాష్ట్ర పార్టీగా ఎలక్షన్ కమిషన్ గుర్తించలేదు.
యూపీలో ఆర్ ఎల్ డి పార్టీకి రాష్ట్ర పార్టీ హోదాను వెనక్కి తీసుకుంది.
 పశ్చిమ బెంగాల్ లో రివల్యూషన్ సోషలిస్ట్ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా లభించింది.
వాయిస్ ఆఫ్ ద పీపుల్ పార్టీ మేఘాలయలో రాష్ట్ర పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది.






సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం కేసీఆర్ నేతృత్వంలోని BRS కు షాక్ ఇచ్చింది. ఏకంగా రాష్ట్ర పార్టీ గుర్తింపును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కారణం బీఆర్ఎస్ కు ముందు TRS ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే పార్టీ గా రిజిస్టర్ చేయించుకుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో అధికారంలో కి వచ్చిన TRS ఇక్కడ మాత్రమే పార్టీగా కొనసాగింది. ఏపీలో కనీసం ఎన్నికల్లో పోటీ కూడా చేయనుందున ఇప్పుడు ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పార్టీ హోదాను బీఆర్ఎస్ కు రద్దు చేస్తూ ఈ సీ ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ ఈ సారి ఆంధ్రప్రదేశ్ సహా తెలుగు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయాలని ప్రణాళికలు రచించుకుంటున్న వేళ ఈసీ ఏపీలో రాష్ట్రపార్టీ హోదా రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేయటం చర్చనీయాంశంగా మారింది.


ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలో నిలిపి బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ అన్నారు. ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీఆర్‌ఎస్‌ నిలవబోతుందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పలువురు కాపు నాయకులు, మద్దతుదారులతో హోటల్‌ షెల్టన్‌లో ఆయన సమావేశం అయ్యారు. కేసీఆర్‌ ఒక్కరే మోదీను ఎదుర్కోగలరని, ఏపీ ప్రభుత్వం కేంద్రానికి దాసోహం అయ్యిందని విమర్శించారు. కేంద్రం మెడలు వంచాలంటే అది బీఆర్‌ఎస్‌ వల్లనే అవుతుందని, ఏపీలో ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీచేసి అధికారంలోకి వస్తామని అన్నారు.