Amit Shah Arunachal Visit:
అమిత్‌షా పర్యటన
అరుణాల్ ప్రదేశ్ విషయంలో చైనా మొండి వాదన మానడం లేదు. పైగా పేర్లు మారుస్తామంటూ సంచలన ప్రకటన చేసింది. ఈ వివాదం ముదురుతున్న క్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. దీనిపై చైనా తీవ్రంగా స్పందించింది. ఈ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ భూభాగంలో అమిత్‌షా పర్యటించి నిబంధనలు ఉల్లంఘించారని మండి పడింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై ఓ నోట్ విడుదల చేసింది. గత వారమే చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లు మార్చింది. అవన్నీ చైనాలో భాగమే అని తేల్చి చెప్పింది. "జంగ్నన్ (Zangnan) మాదే" అంటూ అరుణాచల్‌కు కొత్త పేరు పెట్టింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ అమిత్‌షా పర్యటనపై అసహనం వ్యక్తం చేశారు.
"భారత అధికారులు జంగ్నన్ (అరుణాచల్ ప్రదేశ్)లో అడుగు పెట్టి సరిహద్దు నిబంధనలు ఉల్లంఘించారు. సరిహద్దులో ఇరు దేశాలు శాంతికి కట్టుబడి ఉండాలన్న సూత్రాన్ని మరిచారు"
- వాంగ్ వెన్‌బిన్, చైనా విదేశాంగ ప్రతినిధి
కిబితూలో పర్యటన..
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు గ్రామమైన కిబితూ (Kibithoo)లో పర్యటిస్తున్నారు. ఇది చైనా సరిహద్దుకు కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇక్కడే Vibrant Villages Programme కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదే క్రమంలో చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్ తమదే అన్న చైనా వాదనపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఎవరూ సరిహద్దు వైపు చూసే సాహసం కూడా చేయలేరని తేల్చి చెప్పారు.
"మా సరిహద్దుపై కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేరు. గుండు సూది మందం ప్రాంతాన్ని కూడా ఆక్రమించలేరు. ఎవరైనా భారత్‌లోకి చొచ్చుకొచ్చే రోజులు పోయాయి. ఆర్మీ పగలనకా, రాత్రనకా కాపలా కాస్తోంది కాబట్టే ఇవాళ భారత దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు."
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
ఈ ప్రోగ్రామ్ ద్వారా...అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్ట్‌లు చేపట్టనుంది కేంద్ర ప్రభుత్వం. 19 జిల్లాల్లోని 46 బ్లాకుల్లో 2,967 గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని కేంద్రం భావిస్తోంది. అయితే....అమిత్‌షా పర్యటనను చైనా ఖండించడంపై భారత్ కూడా గట్టిగానే స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ తమదే అని తేల్చి చెబుతోంది. ఇటీవల పేర్లు మార్చడంపైనా తీవ్రంగా విమర్శించింది.
"ఇప్పుడే కాదు. చైనా పదేపదే ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉంది. ప్రతిసారీ మేం ఖండిస్తూనే ఉన్నాం. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌దే. చైనా పేర్లు మార్చినంత మాత్రా నిజాలు మారిపోవు. ఇదే విషయాన్ని మరోసారి గట్టిగా చెబుతున్నాం'
- అరిందం బగ్చి, భారత విదేశాంగ ప్రతినిధి
Also Read: Vande Bharat Express Train: హైదరాబాద్-బెంగళూరు మధ్య వందేభారత్ ట్రైన్? త్వరలోనే అధికారిక ప్రకటన!