Hyderabad To Bengaluru Vande Bharat Express:


హైదరాబాద్-బెంగళూరు వందేభారత్..? 


వరుసగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లను ప్రారంభిస్తున్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఇటీవలే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చ జెండా ఊపారు. ఆ తరవాత చెన్నైలోనూ ఏ ట్రైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే హైదరాబాద్-బెంగళూరు మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు ప్రస్తుతానికి తెలియకపోయినా...ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలోని బీజేపీ నేతలకు ఈ వివరాలు చెప్పినట్టు సమాచారం. గత వారం ప్రధాని హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. అప్పుడే బీజేపీ నేతలతో ఈ విషయం చెప్పారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే తెలంగాణకు మూడో వందేభారత్ ట్రైన్‌ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖ, సికింద్రాబాద్-తిరుపతి సర్వీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్-బెంగళూరు ట్రైన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. అయితే..ఈ ఏడాది జనవరిలోనే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని కాచిగూడ మధ్యలో సెమీ హైస్పీడ్ ట్రైన్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. మరో నెలలో ఎన్నికలకు వెళ్లనున్న కర్ణాటకలో బీజేపీ నేతలు ఇప్పటికే దీనిపై ప్రచారం కూడా చేస్తున్నారు. త్వరలోనే వందేభారత్ ట్రైన్ వచ్చేస్తుందని చెబుతున్నారు. 


సికింద్రాబాద్-తిరుపతి సర్వీస్‌లు మొదలు..


సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రెండో వందేభారత్‌ ట్రైన్. ఇప్పటికే విశాఖ- సికింద్రాబాద్ మధ్య వందేభారత్ నడుస్తోంది. ఈ ట్రైన్‌ 130 కిలోమీటర్ల వేగంతో సికింద్రాబాద్‌ గూడూరు మధ్య ప్రయాణించనుంది. తెనాలి, నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగనుంది. సికింద్రాబాద్‌, తిరుపతి మధ్య 661 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఈ దూరాన్ని వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ఎనిమిదిన్నర గంటల్లోనే చేరుకుకుంటుంది. ప్రయాణికులు ఈ ట్రైన్ ఎక్కేందుకు స్లైడింగ్ ఫుట్‌స్టెప్‌లను, ఆటోమెటిక్ ప్లగ్ డోర్‌లను అమర్చారు. కోచ్‌ల మధ్య టచ్‌ఫ్రీ స్లైడింగ్‌ డోర్‌లను అమర్చారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాష్‌రూంలు సికింద్రాబాద్, తిరుపతి వందేభారత్‌ ట్రైన్‌లో ఉన్నాయి. ఈ ట్రైన్ ఉదయం ఆరు గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరనుంది. మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల మధ్య తిరుపతి చేరుకుటుంది. అక్కడ 3.15కి బయల్దేరి రాత్రి  11.30 నుంచి పన్నెండు గంటల మధ్య సికింద్రాబాద్ చేరుకుంటుంది. విశాఖ- సికింద్రాబాద్‌ మధ్య నడిచే వందే భారత్‌కు ఆదివారం సెలవు అయితే... తిరుపతి- సికింద్రాబాద్ మధ్య నడిచే ట్రైన్‌కు మంగళవారం సెలవు దినంగా ప్రకటించారు. 


భారీ కేటాయింపులు..


వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) స్లీపర్ వెర్షన్ కోసం రైల్వే బడ్జెట్ నుంచి రూ. 1800 కోట్ల కేటాయింపులకు ఆమోదించారు. వచ్చే రెండేళ్లలో, దేశంలోని వివిధ మార్గాల్లో ఈ వెర్షన్‌కు చెందిన 400 రైళ్లను పట్టాల పైకి తీసుకురానున్నారు. ఈ రైళ్లను తయారు చేసేందుకు ఐసీఎఫ్‌తోపాటు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి. IANS (Indo Asian News Service) వార్తల ప్రకారం.. 400 రైళ్లలో, మొదటి 200 చైర్ కార్ రైళ్లు, మిగిలినవి స్లీపర్ వెర్షన్‌. చైర్ కార్ రైళ్లు గరిష్టంగా 180 కి.మీ. వేగంతో నడిచేలా డిజైన్ చేస్తారని, కానీ 130 కి.మీ. వేగంతో నడుపుతారని తెలుస్తోంది.