Congress message to Pilot: 


పైలట్ తిరుగుబాటు 


సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేస్తున్నారు రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలట్. తమ ప్రభుత్వం అవినీతిపరులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అందుకే నిరాహార దీక్ష చేస్తానని సంచలన ప్రకటన చేశారు. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం గుర్రుగా ఉంది. ఇప్పటికే గహ్లోట్, పైలట్ మధ్య ఉన్న విభేదాలను తగ్గించేందుకు సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో గహ్లోట్ సర్కార్‌పై పైలట్ విమర్శలు చేయడం రాజస్థాన్ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. అయితే...అధిష్ఠానం మాత్రం ఈ విషయంలో తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు. సచిన్ పైలట్‌కు వార్నింగ్ కూడా ఇచ్చినట్టు సమాచారం. క్రమశిక్షణారాహిత్యాన్ని ముమ్మాటికీ సహించేది లేదని హెచ్చరించినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిణామాలను హైకమాండ్ పరిశీలిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ప్రభాత్ రంధ్వాకు ఈ సమస్యను చక్కదిద్దే బాధ్యతను అప్పగించినట్టు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేడా స్పందించారు. పార్టీలో ఏమైనా సమస్యలుంటే నేరుగా ఇన్‌ఛార్జ్‌తో చెప్పాలని తేల్చి చెప్పారు. అవినీతిపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సంజీవని అంశంలో రాజస్థాన్ బీజేపీ సీనియర్ నేత గజేంద్ర షెకావత్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకునే వారిని అధిష్ఠానం గమనిస్తోందని వెల్లడించారు. 


పైలట్‌ను వ్యతిరేకించే వాళ్లే కాదు. ఆయనకు మద్దతుగా నిలుస్తున్న కాంగ్రెస్ నేతలూ ఉన్నారు. రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ పైలట్‌కు సపోర్ట్‌గా నిలిచారు. కాంగ్రెస్‌కు పైలట్ లాంటి వ్యక్తులు అవసరం అని, ఆయన ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. 


"సచిన్ పైలట్ అడిగే ప్రశ్నల్లో అర్థముంది. కేంద్రంలో రాహుల్ గాంధీ అదానీ స్కామ్‌పై పోరాడుతున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం అవినీతి పరులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇదే విషయాన్ని సచిన్ పైలట్ ప్రశ్నించారు. ఇప్పటి వరకూ అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలి. సాధారణ కార్యకర్తకూ ఈ ప్రశ్న అడిగే హక్కుంది. ఇప్పుడు ఏకంగా పార్టీలోని కీలక నేత అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది"


- ప్రతాప్ సింగ్, రాజస్థాన్ మంత్రి 


గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వీటిపై సీబీఐ విచారణ కూడా జరిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు రాజస్థాన్ మాడీ డిప్యుటీ సీఎం సచిన్ పైలట్. 


"అవినీతిపై మా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై మైనింగ్ స్కామ్ ఆరోపణలు వచ్చాయి. అయినా దీనిపై CBI విచారణ జరపడం లేదు. లలిత్ మోదీపైనా ఎలాంటి చర్యలు లేవు. ఇలా అయితే ప్రజలకు తప్పుడు సందేశం ఇచ్చిన వాళ్లమవుతాం. మా ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ఎన్నో హామీలిచ్చాం. అవినీతిని అడ్డుకుంటామని భరోసా కల్పించాం. కానీ ఇప్పుడది జరగడం లేదు. దీనిపై నిరసనగానే నేను నిరాహార దీక్ష చేస్తాను. ఇప్పటి వరకూ ప్రభుత్వం చేయని పనులన్నీ చేయాలన్నదే నా లక్ష్యం" 


-  సచిన్ పైలట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే 


Also Read: Agnipath Recruitment: అగ్నిపథ్‌ స్కీమ్‌కు వ్యతిరేకంగా పిటిషన్‌లు, తిరస్కరించిన సుప్రీం కోర్టు