SC on Agnipath Recruitment:
ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదు: సుప్రీం కోర్టు
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమేమీ కాదని తేల్చి చెప్పింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమలు చేసిన పథకమే అని వెల్లడించింది. ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్‌లను బుట్టదాఖలు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌లను తోసిపుచ్చింది.
"ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో మేం జోక్యం చేసుకోదలుచుకోలేదు. అన్ని అంశాలూ పరిశీలించాకే హైకోర్టు తీర్పు ఇచ్చింది"
- సుప్రీం కోర్టు
సమర్థించిన ఢిల్లీ హైకోర్టు..
అయితే...ఏప్రిల్ 17న మరో పిటిషన్‌పై విచారణ జరుపుతామని వెల్లడించింది. IAFలో అగ్నిపథ్ ద్వారా రిక్రూట్‌మెంట్ చేయడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచారిస్తామని తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టులో రెండు పిటిషన్‌లు దాఖలయ్యాయి. అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్‌మెంట్ జరపడం సరికాదని గోపాల్ కృష్ణన్‌తో పాటు ఓ అడ్వకేట్ ఎమ్‌ఎల్ శర్మ పిటిషన్‌లు వేశారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం సరైందే అని తేల్చి చెప్పింది. అగ్నిపథ్ స్కీమ్ సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంచుతుందని అభిప్రాయపడింది. ఫలితంగా..పిటిషన్ దారులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇక్కడా వారికి చుక్కెదురైంది.
అగ్నిపథ్ పథకం కింద పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయస్సు గల యువకులు నాలుగు సంవత్సరాల పాటు సాయుధ దళాలలో పనిచేస్తారు. అయితే వారిలో 25 శాతం మంది తరువాత సాధారణ సేవ కోసం కొనసాగిస్తారు. ఈ పథకం కింద రిక్రూట్‌మెంట్ కోసం గరిష్ట వయో పరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచిందనట్లు జూన్ 16న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అగ్నివీరులకు కేంద్ర పారామిలిటరీ బలగాలు, డిఫెన్స్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రాధాన్యత ఇస్తామని ఉపశమన చర్యలు ప్రకటించింది కేంద్రం. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అగ్నిపథ్ పథకం కింద పనిచేసిన సైనికులను రాష్ట్ర పోలీసు బలగాలలో తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించాయి. కొత్త రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు, అగ్నిప్రమాదాలకు పాల్పడిన వారిని చేర్చుకోబోమని సాయుధ దళాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.
Also Read: Bengal Ram Navami Violence: ఈ దాడులు పథకం ప్రకారం చేసినవే, బెంగాల్ రామనవమి అల్లర్లపై కమిటీ నివేదిక