IPL Hat Trick List: ఐపీఎల్ - 16లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. గుజరాత్ టైటాన్స్ - కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన సీజన్ 13వ మ్యాచ్‌లో జీటీకి స్టాండ్ ఇన్ స్కిప్పర్‌గా బరిలోకి దిగిన రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. ఈ సీజన్ లో ఇదే తొలి హ్యాట్రిక్ కావడం గమనార్హం. కేకేఆర్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రషీద్ ఈ అద్భుతాన్ని చేశాడు. వరుస బంతుల్లో ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్ లతో పాటు ఆర్సీబీతో గత మ్యాచ్‌లో గడగడలాడించిన శార్దూల్ ఠాకూర్‌ను ఔట్ చేశాడు. తద్వారా ఈ సీజన్ లో తొలి హ్యాట్రిక్ తీసిన బౌలర్ గానే గాక పలు రికార్డులను నమోదు చేశాడు. అయితే ప్రస్తుత టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరిట కూడా హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఘనత ఉందన్న సంగతి ఎంతమందికి తెలుసు..? కానీ ఇది నిజం.
రికార్డులే రికార్డులు :
రషీద్ ఖాన్ హ్యాట్రిక్ ఈ సీజన్ తో పాటు గుజరాత్ టైటాన్స్‌కు కూడా మొదటిదే. గతేడాది ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టుకు ఇదే ఫస్ట్ హ్యాట్రిక్. ఇక మొత్తంగా ఐపీఎల్ లో 22వది. రషీద్ ఖాన్‌కు కూడా ఐపీఎల్ లో ఇదే ఫస్ట్ హ్యాట్రిక్. గతంలో అతడు కరేబియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్ తో పాటు ఐర్లాండ్ తో అంతర్జాతీయ మ్యాచ్ లో హ్యాట్రిక్ తీశాడు. మొత్తంగా అతడికి టీ20 ఫార్మాట్‌లో ఇది నాలుగో హ్యాట్రిక్. తద్వారా రషీద్.. టీ20లలో మూడు సార్లు హ్యాట్రిక్ తీసిన ఆండ్రూ టై, అమిత్ మిశ్రా, ఆండ్రూ రసెల్, ఇమ్రాన్ తాహిర్ ల రికార్డును అధిగమించాడు.
ఐపీఎల్‌లో ఫస్ట్ హ్యాట్రిక్ బాలాజీదే..
కేకేఆర్‌తో మ్యాచ్ లో రషీద్ తీసిన హ్యాట్రిక్ 22వది కాగా. ఈ లీగ్ లో అందరికంటే ముందు వరుస బంతుల్లో ముగ్గుర్ని ఔట్ చేసిన ఘనత చెన్నై బౌలర్, ప్రస్తుతం ఆ జట్టు కోచింగ్ సిబ్బందిలో భాగంగా ఉన్న లక్ష్మీపతి బాలాజీ పేరిటే ఉంది. బాలాజీ ఐపీఎల్ ఓపెనింగ్ సీజన్ (2008)లో కింగ్స్ లెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో హ్యాట్రిక్ తీశాడు. ఇర్ఫాన్ పఠాన్, పీయూష్ చావ్లా, విఆర్వీ సింగ్ లను ఔట్ చేసి ఈ లీగ్ లో తొలి హ్యాట్రిక్ నమోదుచేశాడు. ఇదే సీజన్ లో మరో ఇద్దరు బౌలర్లు కూడా ఈ ఘనత సాధించారు. అప్పుడు డెక్కన్ ఛార్జర్స్ కు ఆడిన అమిత్ మిశ్రా, ముఖయా ద ఎన్తిని లు కూడా హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టారు.
టీమిండియా కెప్టెన్ పేరిట హ్యాట్రిక్..
ఈ జాబితాలో 2009 సీజన్ లో ప్రస్తుత భారత జట్టు సారథి రోహిత్ శర్మ కూడా హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నాడనే విషయం చాలామందికి తెలియదు. 2009 సీజన్ లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్.. ప్రస్తుతం తాను సారథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ పైనే హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టాడు. 2009 సీజన్ లో రోహిత్ తో పాటు యువరాజ్ సింగ్ (రెండుసార్లు) ఈ ఘనత అందుకున్నాడు.
జాబితా పెద్దదే..
బాలాజీ, ఎన్తిని, అమిత్ మిశ్రా (మూడు సార్లు), రోహత్ శర్మ, యువరాజ్ సింగ్ (2 సార్లు), ప్రవీణ్ కుమార్, అజింత్ చండిలా, సునీల్ నరైన్, ప్రవీణ్ తాంబె, షేన్ వాట్సన్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, సామ్ కరన్, శ్రేయాస్ గోపాల్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చహల్, రషీద్ ఖాన్ లు ఈ జాబితాలో ఉన్నారు.