Karnataka Chief Minister: కర్ణాటకలో అద్భుత విజయం తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్. సీఎంగా సిద్ధరామయ్య పేరును అధిష్ఠానంతోపాటు సీఎల్పీ కూడా ఓకే చెప్పేసింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది. అయితే కర్ణాటకలో విజయానికి కాంగ్రెస్ ఎంత కష్టపడిందో... ముఖ్యమంత్రిని ఎంపిక చేయడానికి అంతకంటే ఎక్కువే కష్టపడిందని చెప్పొచ్చు.
కళ్లముందే కనిపిస్తున్న రాజస్థాన్ రగడను దృష్టిలో పెట్టుకొని సమీప భవిష్యత్‌లో వివాదమే లేకుండా చేయడానికి శతవిధాలా ప్రయత్నాలు చేసింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం కుర్చీ కోసం సాగిన పోరులో కాంగ్రెస్ పెద్దలు జుట్టు పీక్కోవాల్సి వచ్చింది. బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు మూడు రోజుల పాటు మారథాన్ సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్ పెద్దలంతా ఈ సమస్య పరిష్కారానికి రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
అసలు ఈ 72 గంటల్లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం..
ఆదివారం 14 మే
మే 13న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 135 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. మరుసటి రోజు ఆదివారం (మే 14) సాయంత్రం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశమై నాయకుడిని ఎన్నుకోవడానికి బదులు ఓ తీర్మానం చేసి అధినాయకత్వానికి పంపింది. ఏకవాక్య తీర్మానం చేసి శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే హక్కును కాంగ్రెస్ అధ్యక్షుడికి అప్పగించారు.
సోమవారం 15 మే (ఉదయం)
కాంగ్రెస్ నియమించిన ముగ్గురు పరిశీలకులు తదుపరి ముఖ్యమంత్రి గురించి ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కోరారు. దీని కోసం ఎమ్మెల్యేలకు రహస్య ఓటింగ్ నిర్వహించారు. ముగ్గురు పరిశీలకులు ఉదయం 10 గంటలకు ఢిల్లీకి బయలుదేరి అక్కడి కాంగ్రెస్ అధ్యక్షుడికి ఆ నివేదిక సమర్పించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఇంచార్జీ రణ్ దీప్ సూర్జేవాలాతో సోమవారం రాత్రి మల్లిఖార్జున ఖర్గే ఈ నివేదికపై చర్చించారు.
సోమవారం మధ్యాహ్నం
డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు ఢిల్లీలో డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ ను కలిసి ఢిల్లీకి రావాలని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడికి సమాచారం ఇచ్చారు. ఆ టైంలోనే సిద్ధరామయ్య కూడా ఢిల్లీ వెళ్లారు.
మంగళవారం మధ్యాహ్నం
సోమవారం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడి నివాసంలో వరుస సమావేశాలు కొనసాగాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఖర్గేను కలిసి కర్ణాటక పంచాయితీపై చర్చించారు. ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఎంపికలో ఎమ్మెల్యేల అభిప్రాయానికే రాహుల్ గాంధీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇది గతం నుంచి కొనసాగుతున్న సంప్రదాయమని ఆయన ప్రస్తావించినట్టు సమాచారం.
మంగళవారం సాయంత్రం
ఈ నెల 16వ తేదీ సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను ఆయన నివాసంలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య కలిశారు. అయితే, ఇది మర్యాదపూర్వక భేటీగా అభివర్ణించిన కాంగ్రెస్ సీఎం ప్రకటనపై ఎటూ తేల్చలేకపోయింది. ఇరువురు నేతల నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు అభిప్రాయాలు కోరినట్లు సమాచారం.
మంగళవారం అర్థరాత్రికల్లా కర్ణాటక తదుపరి సీఎం సిద్ధరామయ్య అని నిర్ణయించినప్పటికీ డీకే శివకుమార్ అభ్యంతరంతో అధికారిక ప్రకటన చేయలేకపోయారు. డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసినా డీకే శివకుమార్ ఒప్పుకోలేదు. దీంతో ఎటూ తేలకుండానే మంగళవారం చర్చలు ముగిశాయి.
బుధవారం మధ్యాహ్నం
మే 17న సీఎం అభ్యర్థులు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వేర్వేరుగా టెన్ జన్ పథ్‌కు చేరుకుని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. పార్టీ అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకున్నా పాటించి పార్టీ ప్రయోజనాల కోసం పని చేయాలని రాహుల్ గాంధీ వారిద్దరినీ కోరారు.
బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు
ఖర్గేను ఆయన నివాసంలో కలిసేందుకు డీకే శివకుమార్‌ను పిలిపించారు. అదే సమావేశంలో సిద్ధరామయ్యకు అత్యధిక మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున శాసనసభా పక్ష నేతగా ఉండాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు డీకేకు తెలియజేశారు. ఈ తీర్పును అంగీకరించని డీకే రాష్ట్రంలో పార్టీ విజయానికి ఎంత కృషి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బుధవారం రాత్రి 7 గంటలకు..
డీకే పట్టుబట్టడంతో సీఎంగా సిద్దారామయ్య పేరును కాంగ్రెస్ ప్రకటించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో ఖర్గే బుధవారం సాయంత్రం యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీతో ఫోన్‌లో మాట్లాడారు. సోనియాగాంధీ కూడా ఎమ్మెల్యేల అభిప్రాయంతో వెళ్లాలని చెప్పిట్టు పార్టీ వర్గాలు చెబుతున్నారు.
బుధవారం రాత్రి 8 గంటలకు..
వేణుగోపాల్, సుర్జేవాలాలతో సమావేశమైన ఖర్గే డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు తనకు నచ్చిన మంత్రిత్వ శాఖను ఆఫర్ చేశారు.
బుధవారం అర్థరాత్రి
అనంతరం వేణుగోపాల్ సిద్ధరామయ్య, శివకుమార్‌ను వారి నివాసాల్లో విడివిడిగా కలిసి పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని వివరించారు. ఒక్క డిప్యూటీ సీఎం పదవి మాత్రమే ఉంటుందని చెప్పారు. అయినా డీకే శివకుమార్ సముఖంగా లేకపోవడంతో నేరుగా సోనియాగాంధీ రంగంలోకి దిగారు. శివకుమార్‌కు ఫోన్ చేసి ఒప్పించారు. ఆ ఫోన్ కాల్‌తో మొత్తం మారిపోయింది. సిద్దరామయ్యకు సీఎం పదవి ఇచ్చి డిప్యూటీ సీఎంగా ఉండేందుకు డీకే శివకుమార్ అంగీకరించారు.
ఒప్పందం కుదిరిన తర్వాత వేణుగోపాల్, సుర్జేవాలా, సిద్ధరామయ్య, డీకే శివకుమార్త్‌తో కలిసి అర్ధరాత్రి ఖర్గే ఇంటికి చేరుకున్నారు
Also Read: కోర్టులో ఎంత మంది వాదించినా, జడ్జ్ తీర్పే ఫైనల్ - హైకమాండ్‌పై డీకే శివకుమార్ కామెంట్స్
Also Read: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి "కరెంట్ షాక్" - బిల్స్ కట్టేదే లేదంటున్న గ్రామస్థులు