Karnataka Free Electricity:


ఫ్రీ అన్నారుగా..


కర్ణాటకలో సీఎం పేరు అనౌన్స్ అయిందో లేదో అప్పుడే ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీయడం మొదలు పెట్టారు. మొత్తం 5 హామీలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అందులో కీలకమైంది...200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సరఫరా. అయితే...ఇప్పుడిదే ఆ ప్రభుత్వానికి చిక్కు తెచ్చి పెట్టింది. కొన్ని గ్రామాల్లోని ప్రజలు కరెంట్ బిల్స్ కట్టం అని మొండికేస్తున్నారు. ఎందుకని అడిగితే.."ఫ్రీగా ఇస్తామని గవర్నమెంట్ చెప్పిందిగా" అని వాదిస్తున్నారు. కొప్పాల్, కలబుర్గి, చిత్రదుర్గ జిల్లాల్లోని గ్రామాల్లోని ప్రజలు కరెంట్ బిల్స్ కట్టడంలేదు. అధికారంలోకి వచ్చిన తరవాత ఉచితంగా విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, మేమెందుకు బిల్స్ కట్టాలని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మీటర్ రీడింగ్స్ కోసం అధికారులు వెళ్లినప్పుడు ఇలా వాదించారు. ఓ మహిళకి బిల్ ఇవ్వగానే.."మేం కట్టం" అని ముఖం మీదే చెప్పిందని ఓ అధికారి వెల్లడించారు. కాంగ్రెస్‌కి ఓటు వేసిన మరుక్షణం నుంచే ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమల్లోకి వస్తాయని తేల్చి చెబుతున్నారు గ్రామస్థులు. 


"సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లే మా కరెంట్ బిల్స్ కడతారు. ఎన్నికల్లో గెలిస్తే ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. అందుకే...ఇకపై బిల్స్ ఇవ్వడానికి మా దగ్గరికి రాకండి. మీరు వచ్చినా మేం కట్టం. ఎప్పుడైతే మేం ఈవీఎమ్‌లో కాంగ్రెస్‌ గుర్తుని చూసి బటన్ నొక్కామో..అప్పటి నుంచే ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమల్లోకి వస్తాయి. ఏం చేసినా మేమైతే బిల్స్ కట్టం"


- గ్రామస్థులు 


ఎన్నికల ముందు కాంగ్రెస్ 5 హామీలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో వీటి గురించి బాగా ప్రచారం చేసుకుంది. గృహ జ్యోతి యోజనలో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. గృహ లక్ష్మి యోజన కింద కుటుంబంలోని ఒక్కో మహిళకు రూ.2 వేలు ఇస్తామని చెప్పింది. అంతే కాదు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్‌ సర్వీస్‌లనూ అందిస్తామని హామీ ఇచ్చింది. యూత్‌ని టార్గెట్ చేస్తూ...గ్రాడ్యుయేట్ యువతకు నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పింది. ఈ హామీలు...ఓట్ల వర్షం కురిపించాయి. అయితే...ఇవే హామీలను ప్రధాని నరేంద్ర మోదీ తప్పుబట్టారు. "ఉచిత హామీలు హానికరం" అంటూ విమర్శించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు "ఈ హామీలు ఎలా నెరవేర్చుతారు" అన్న ప్రశ్న ఎదురవుతోంది. దీనిపై డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. 


ఇప్పుడు ఆలోచించాల్సిందల్లా ఒక్కటే. పని చేయడం. వారం రోజుల్లో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలి. ఈ విజయాన్ని సరైన విధంగా వాడుకోవాలి. ఇక హామీలు ఎలా నెరవేరుస్తామన్న సంగతి మాకు వదిలేయండి. అందుకోసం స్పెషల్ టీమ్ ఉంది. అన్ని ఆలోచించుకునే ఆ హామీలిచ్చాం"


- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం


Also Read: Karnataka Election 2023: కర్ణాటక సీఎం పదవిపై ఉత్కంఠకు తెర, సిద్దరామయ్యకే ఓటు వేసిన హైకమాండ్