Karnataka Election 2023: 



సుదీర్ఘ చర్చల తరవాత ప్రకటన..


కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరన్న (Karnataka CM Race) ఉత్కంఠకు తెరపడింది. బెంగళూరులో సుదీర్ఘ చర్చల తరవాత హైకమాండ్ సిద్దరామయ్యనే ముఖ్యమంత్రిగా ప్రకటించింది. డీకే శివకుమార్‌ కూడా రేసులో ఉన్నప్పటికీ...సీనియర్ నేత అన్న గౌరవంతో ఆయనకే ఆ పదవి కట్టబెట్టింది. ఆయనకు డిప్యుటీ సీఎం పదవి అప్పగించింది. అన్ని విధాలుగా ఆలోచించిన తరవాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ఈ విషయం వెల్లడించారు. డీకే శివకుమార్ పార్టీ కోసం చేసిన కృషిని అభినందించింది. శివకుమార్, సిద్దరామయ్యలో ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో చాలా చర్చలు జరిగాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో సంప్రదింపులు జరిపిన తరవాత సిద్దరామయ్యను ఎంపిక చేశారు. శివకుమార్‌ని పీసీసీ ప్రెసిడెంట్‌గా కూడా నియమించింది. 2024లో లోక్‌సభ ఎన్నికలు ముగిసేంత వరకూ ఆయనే ప్రెసిడెంట్‌గా కొనసాగుతారని వేణుగోపాల్ స్పష్టం చేశారు. మే 20న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు కొందరు మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండే ప్రతి పార్టీనీ ఆహ్వానిస్తామని తెలిపారు.