DK Shivakumar:


డిప్యుటీ సీఎంగా డీకే శివకుమార్..


కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య పేరుని ఖరారు చేసింది హైకమాండ్. నంబర్ వన్ పొజిషన్‌లో ఉండాలనుకున్న డీకే శివకుమార్..నంబర్ 2కి పరిమితమయ్యారు. దీనిపై ఆయన అసహనంగా ఉన్నారంటూ పుకార్లు వినిపించాయి. సిద్దరామయ్య, శివకుమార్ మధ్య విభేదాలున్నాయనీ కొందరు ప్రచారం చేశారు. అయితే...అధిష్ఠానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు డీకే. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టులో జడ్జ్‌ తీర్పుని గౌరవించినట్టే..హైకమాండ్ డిసిషన్‌ని గౌరవిస్తున్నానని వెల్లడించారు. సోనియా గాంధీతో భేటీ అవ్వనంత వరకూ వెనక్కి తగ్గని శివకుమార్..ఆ తరవాత మనసు మార్చుకున్నారు. పార్టీ అవసరం మేరకు త్యాగం చేయక తప్పలేదని స్పష్టం చేశారు. 


"నిర్ణయం తీసుకునే అధికారాన్ని అధిష్ఠానానికే కట్టబెట్టినప్పుడు ఆ తీర్పు ఎలా ఉన్నా గౌరవించాలి. కోర్టులో చాలా మంది తమ వాదనలు వినిపిస్తుండొచ్చు. కానీ...అల్టిమేట్‌గా జడ్జ్ చెప్పిన తీర్పుకి కట్టుబడి ఉండాలి. మా విషయంలోనూ 135 ఎమ్మెల్యేలూ ఒకేమాటపై నిలబడ్డారు. హైకమాండ్‌కే నిర్ణయాన్ని వదిలేశారు"


- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం


కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా కలిసికట్టుగా పని చేస్తామని డీకే తేల్చి చెప్పారు. 


"మేం కర్ణాటక ప్రజలకు భరోసానిచ్చాం. వ్యక్తిగత ఆశలు, ఆశయాలు తరవాత. ముందు పార్టీ గురించే ఆలోచిస్తాం. అదే నా నిబద్ధతకు నిదర్శనం. ఒకవేళ కాంగ్రెస్ గెలవకపోయుంటే మా పొజిషన్ ఎలా ఉండేది? కానీ మేం ఆ సవాలు దాటి గెలిచాం. ఆ ప్రతిఫలం నా ఒక్కడిదే కాదు. లక్షలాది మందిది. అలాంటప్పుడు వాళ్ల తరపున కూడా ఆలోచించాలిగా"


-  డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం


సోనియా గాంధీతో భేటీ అయిన తరవాతే మనసు మార్చుకున్నారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదు డీకే శివకుమార్. ప్రస్తుతానికి ఆ టాపిక్‌ మాట్లాడనని సున్నితంగా తిరస్కరించారు. 


"సోనియా గాంధీని కానీ..మరే ఇతర గాంధీ కుటుంబ సభ్యుల్ని కానీ ఇందులోకి లాగదలుచుకోవడం లేదు. నేను కేవలం రాహుల్ గాంధీని మాత్రమే కలిశాను. మల్లికార్జున్ ఖర్గేతో పాటు AICCతోనూ చర్చించాను. సిద్దరామయ్యతో పవర్ షేరింగ్‌పై నాకేమంత అసంతృప్తి లేదు. ఇప్పుడు ఆలోచించాల్సిందల్లా ఒక్కటే. పని చేయడం. వారం రోజుల్లో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలి. ఈ విజయాన్ని సరైన విధంగా వాడుకోవాలి. ఇక హామీలు ఎలా నెరవేరుస్తామన్న సంగతి మాకు వదిలేయండి. అందుకోసం స్పెషల్ టీమ్ ఉంది. అన్ని ఆలోచించుకునే ఆ హామీలిచ్చాం"


- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం


తాము అంతా కలిసే ఉన్నామని, కర్ణాటక ప్రజల సంక్షేమమే తమ ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు. సిద్దరామయ్య, ఖర్గేతో కలిసి దిగిన ఫోటోని ట్విటర్‌లో పంచుకున్నారు. 


"కర్ణాటక ప్రజల భవిష్యత్‌కి భరోసా ఇవ్వడం, వాళ్ల సంక్షేమానికి కట్టుబడి ఉండటం..ప్రస్తుతానికి ఇవే మా ప్రాధాన్యత. ఈ విషయంలో మేము కలిసికట్టుగా పని చేస్తామని హామీ ఇస్తున్నాను"


- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం 


Also Read: Karnataka CM Siddaramaiah: రైతు కుటుంబంలో పుట్టిన సిద్ధరామయ్య రెండు సార్లు కర్ణాటక సీఎంగా ఎలా అయ్యారు?