అఫ్గానిస్తాన్ నుంచి 392 మంది సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు. వీరిలో ఇద్దరు అప్గాన్ చట్టసభ సభ్యులు ఉన్నారు. మూడు విమానాల ద్వారా వీరంతా ఇండియాకు వచ్చారు. వీరిలో 168 మంది కాబూల్ నుంచి భారత్‌కు రాగా.. మరో 87 మంది దుషాంబే నుంచి, మిగతా 135 మంది దోహా మీదుగా ఇండియా చేరుకున్నారు. అప్గానిస్తాన్ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు తమ పౌరులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు యత్నాలు మొదలుపెట్టాయి. దీనిలో భాగంగా ఇండియా ప్రతిరోజూ రెండు విమానాలను అప్గాన్ పంపుతోంది.


ఆదివారం లాండ్ అయిన విమానాల్లో మొత్తం 392 మంది దేశానికి చేరుకున్నారు. ఇండియాకు వచ్చిన వారిలో భారతీయులతోపాటు అఫ్గానీ సిక్కులు, హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. అక్కడ చిక్కుకున్న మరికొందరిని కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.


Also Read: Andhra Pradesh News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.... అఫ్గాన్ లో చిక్కుకున్న కార్మికుల కోసం కాల్ సెంటర్... కాబుల్ నుంచి రెండు విమానాలు
హిండన్ ఎయిర్‌బేస్‌కు 168 మంది..
భారత వైమానికి దళానికి చెందిన సీ-17 హెవీ లిఫ్ట్ మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ విమానంలో మొత్తం 168 మంది కాబూల్ నుంచి ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఈ విమానంలో 107 మంది భారతీయులతోపాటు,  అఫ్గాన్ సిక్కులు, హిందువులు, ముస్లింలు ఉన్నారు.
ఇది కాకుండా దుషాన్‌బే నుండి ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 87 మంది భారతీయులు, ఇద్దరు నేపాల్ పౌరుల ఉన్నారని తెలిపారు. ఇక ఇటీవల అమెరికా, నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) విమానాల ద్వారా కాబూల్ నుంచి దోహా చేరుకున్న 135 మంది ఇండియన్లను కటారి క్యాపిటర్ సిటీ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చినట్లు తెలిపారు. 


చిన్నారిని ముద్దాడుతోన్న వీడియో.. 
హిండన్ ఎయిర్‌బేస్‌లో హృదయాన్ని కరిగించే సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక్కడికి చేరుకున్న వారిలో పాలు తాగే శిశువులు, వృద్ధులు కూడా ఉన్నారు. వీరిలో ఒక అక్క చిరునవ్వుతో తన సోదరిని (లేదా సోదరుడు) హత్తుకుని, ముద్దాడుతున్న వీడియో వైరల్ అవుతోంది. మనకు స్వేచ్ఛ లభించిందనే ఆనందం ఆ చిన్నారి కళ్లలో కనిపిస్తోంది.





అప్గానిస్తాన్ నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.  






Also Read: Afghanistan Crisis: 150 మంది భారతీయులు కిడ్నాప్.. అందరూ సురక్షితమే!