ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ (89) మృతితో ఒక సమర్థుడైన నాయకుడిని కోల్పోయామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లఖ్‌నవూలోని కల్యాణ్ సింగ్ నివాసానికి చేరుకున్న మోదీ.. ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కల్యాణ్ సింగ్ కుటుంబ సభ్యులతో దాదాపు 25 నిమిషాలు మాట్లాడారు. కల్యాణ్ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు.
కల్యాణ్ సింగ్ విలువైన వ్యక్తిత్వం గల వ్యక్తి అని మోదీ అన్నారు. ఆయన జీవితం మొత్తం ప్రజాసంక్షేమం కోసమే అంకితం చేశారని తెలిపారు. ఉత్తరప్రదేశ్, భారతదేశం అభివృద్ధి కోసం ఎనలేని సహకారం అందించారని పేర్కొన్నారు. తన పనితీరుతో ఎందరికో ఆదర్శంగా నిలిచారని.. ప్రజల విశ్వాసాన్ని గెలిచిన నేత అని కొనియాడారు. కల్యాణ్ సింగ్ ఆశయాలు, విలువలతో పాటు ఆయన కన్న కలలను సాకారం చేయడం కోసం శాయశక్తులా కృషి చేస్తామని చెప్పారు. ప్రధానితో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సౌతం కల్యాణ్ సింగ్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ (89) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న కల్యాణ్ సింగ్.. లఖ్‌నవూలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తన 60 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక కీలక పదవులు అలంకరించారు. 10 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు ఎంపీగా, 2 రాష్ట్రాలకు గవర్నర్‌గానూ ఆయన సేవలందించారు. ఆయనకు కుమారుడు రాజ్‌వీర్ సింగ్, కుమార్తె ప్రభా వర్మ ఉన్నారు. ఆయన తనయుడు ప్రస్తుతం ఏత్ నుంచి భాజపా ఎంపీగా కొనసాగుతున్నారు.
Also Read: Kalyan Singh Death: యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ కన్నుమూత