ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో లఖ్‌నవూలోని సంజయ్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.





తన 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కీలక పదవులు అలంకరించారు. 10 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ఎంపీగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గానూ ఆయన సేవలందించారు. ఆయనకు కుమారుడు రాజ్‌వీర్‌ సింగ్‌, కుమార్తె ప్రభా వర్మ ఉన్నారు. ఆయన తనయుడు ప్రస్తుతం ఏత్‌ నుంచి భాజపా ఎంపీగా కొనసాగుతున్నారు.


రాజకీయ ప్రస్థానం..



  1. కల్యాణ్ సింగ్ 1932, జనవరి 5న తేజ్‌పాల్‌ సింగ్‌ లోధి, సీతాదేవి దంపతులకు యూపీలోని అలీగఢ్‌ జిల్లా మధౌలీ గ్రామంలో జన్మించారు.

  2. 60 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన అరుదైన నేతగా కల్యాణ్ సింగ్‌ ఉత్తరప్రదేశ్, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.

  3. 1957లో ఆరెస్సెస్‌ ప్రచారక్‌గా మొదలై ఆ తర్వాత జన్‌సంఘ్‌లో చేరడం ద్వారా రాజకీయ జీవితానికి పునాది వేసుకున్నారు.

  4. 1967లో అత్రౌలి నియోజకవర్గం నుంచి భారతీయ జన్‌సంఘ్‌ తరఫున పోటీచేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.

  5. అప్పట్నుంచి వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగించిన కల్యాణ్‌ సింగ్‌కు 1980లో బ్రేక్‌ పడింది.

  6. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (ఐ) నేత అన్వర్‌ఖాన్‌ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతోనే పరాజయం పొందారు.

  7. ఆ తర్వాత 1985లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి భాజపా తరఫున బరిలో దిగి 1996 వరకు విజయ ప్రస్థానాన్ని కొనసాగించారు.

  8. 1967 నుంచి 2002 మధ్య కాలంలో అత్రౌలి నుంచి 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2002లో మాత్రం తాను స్థాపించిన రాష్ట్రీయ క్రాంతి పార్టీ తరఫున బరిలో నిలిచి గెలిచారు.

  9. 1977-79లో యూపీ ఆరోగ్యమంత్రిగా, రెండు పర్యాయాలు సీఎంగా సేవలందించారు. 


21 నెలలు జైల్లో..


ఎమర్జెన్సీ కాలంలో 21 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత బాబ్రీ కేసులో ఇటీవల కోర్టుకు కూడా హాజరయ్యారు కల్యాణ్ సింగ్. తీవ్ర అనారోగ్యంతో నేడు తుదిశ్వాస విడిచారు.


మోదీ దిగ్భ్రాంతి..


ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. కల్యాణ్ కుమారుడు శ్రీ రాజ్‌వీర్ సింగ్‌తో మాట్లాడి సంతాపం తెలిపారు. కల్యాణ్ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కల్యాణ్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడని అన్నారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి ఆయన ఎనలేని సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు.


కల్యాణ్ సింగ్ మృతి పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వం, పనితో కల్యాణ్ భారత రాజకీయాలలో చెరగని ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. కల్యాణ్ మృతితో ఏర్పడిన శూన్యతను ఎప్పటికీ పూడ్చలేమన్నారు. ఆయన మరణంతో తాను పెద్ద అన్నయ్యను, సహచరుడిని కోల్పోయినట్లు ఉందని విచారం వ్యక్తం చేశారు.