Jharkhand News : జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాకు చెందిన 42 ఏళ్ల బీడీ కార్మికుడు జీత్‌రాయ్ సామంత్‌, తన ఆధార్ నంబర్‌తో తప్పుగా లింక్ చేసిన మహిళకు చెందిన డబ్బును విత్ డ్రా చేసినందుకు పోలీసులు అరెస్టు చేశారు.


రెండేళ్ల క్రితం దేశమంతటా క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉన్న స‌మ‌యంలో అకౌంట్‌లోని డ‌బ్బు విష‌యం సామంత్‌కు తెలిసింది. దేశంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ప్ర‌జ‌లకు అవసరమైన సేవలు, సంక్షేమ పథకాల పంపిణీకి పౌర సేవా కేంద్రాలు యాక్సెస్ పాయింట్‌లుగా పనిచేశాయి. కాగా.. ఈ న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ వ్య‌వ‌హారంలో పౌర సేవా కేంద్రాల‌ ప్రతినిధి కూడా నిందితుడికి స‌హ‌క‌రించిన‌ట్టు గుర్తించారు.


గతేడాది సెప్టెంబరులో లగూరి అనే మ‌హిళ‌ తన అకౌంట్ నుంచి డబ్బు మాయమైందని జార్ఖండ్ రాజ్య గ్రామీణ బ్యాంక్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ వ్య‌వ‌హారం వెలుగు చూసింది. ఆధార్ లింక్ కార‌ణంగా జ‌రిగిన పొర‌పాటును గుర్తించి, డబ్బు తిరిగి ఇవ్వాల‌ని బ్యాంక్ మేనేజ‌ర్‌ సామంత్‌కు సూచించాడు. అయితే డ‌బ్బు తిరిగి చెల్లించేందుకు అతను నిరాక‌రించ‌డంతో, అక్టోబర్‌లో అతనిపై జిల్లా గ్రామీణ‌ పోలీసుల‌కు ఫిర్యాదుచేశాడు.


అక్టోబరు నుంచి ఈ నెల‌ వరకు పోలీసుల ముందు హాజరుకావాలని సామంత్‌కు మూడు నోటీసులు వచ్చాయి. అతను నిందితుడిగా ఉన్నందున కోర్టు లేదా పోలీసుల ముందు హాజరుకాకపోతే వారెంట్ లేకుండానే అరెస్టు చేసే అధికారం ఉంది. అయితే.. గ‌త డిసెంబర్‌లో మీడియాతో మాట్లాడిన‌ సామంత్‌ "మొదటి లాక్‌డౌన్ సమయంలో గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ ఆధార్-లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్‌లో మొత్తాన్ని తనిఖీ చేస్తున్నారు. నేను రీడింగ్ మెషీన్‌పై బొటనవేలు పెట్టాను, అది రూ.1,12,000 అని బ్యాలెన్స్ చూపించింది. నేను గ్రామీణ బ్యాంకుకు వెళ్లాను, కానీ అక్కడ డబ్బు జమ అయినట్టు కనిపించలేదు. నేను దాని గురించి అధికారుల‌ను అడిగినప్పుడు, వారు ఆ మొత్తాన్ని ప్రభుత్వం పంపుతుందని నాకు చెప్పారు. ఆరుగురు పిల్లల తండ్రి అయిన నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున లాక్‌డౌన్ సమయంలో డబ్బును ఉపసంహరించుకున్నాను. ఆ న‌గ‌దు  ప్రభుత్వం నుంచి వచ్చిందని నమ్ముతున్నాను" అని చెప్పాడు.


అంతేకాకుండా పోలీసు నోటీసుల్లో ఒకదానికి సామంత్‌ డిసెంబరులో చైబాసా జిల్లా ఎస్పీకి రాసిన లేఖ‌లో  “లాక్‌డౌన్ సమయంలో, మోదీ ప్రభుత్వం ఖాతాలో డబ్బు వేస్తోందని గ్రామంలో చర్చ జరిగింది. నా ఆధార్ లింకైన‌ ఖాతాలో రూ.1 లక్ష న‌గ‌దు ఉన్న‌ట్టు చూపించింది. నేను డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చ‌ని బ్యాంక్ మేనేజర్ చెప్పాడు. ఇప్పుడు నాపై కేసు నమోదైంది. నా తప్పేమీ లేదు. నాకు తెలియకుండానే నా ఆధార్‌ను వేరొకరి బ్యాంక్ ఖాతాకు లింక్ చేశారు. గత రెండు సంవత్సరాలుగా,  బ్యాంకు నాకు సమాచారం ఇవ్వలేదు" అని వివ‌రించాడు. మొదటి నోటీసు అందుకున్న తర్వాత, సామంత్‌ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడ‌ని పంద్రసాలి అబ్జర్వేషన్ పాయింట్ ఎస్ఐ రతు ఒరాన్ తెలిపారు. కానీ అతను వాడుకున్న న‌గ‌దు తిరిగి ఇవ్వడానికి అంగీక‌రించ‌లేద‌ని చెప్పారు. అతని ఆధార్‌ను మ‌రో మ‌హిళ బ్యాంక్‌ ఖాతాతో లింక్ చేయడం వ‌ల్ల‌ పొరపాటు జరిగింది, అయితే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేయకుండా ఉండ‌టం అతని నైతిక బాధ్యత అని ఆయ‌న పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో మార్చి 24న సామంత్‌ను అరెస్టు చేశారు.