రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి వేటు వేయడంపై విపక్షాలు ఏకమయ్యాయి. రాహుల్‌పై చర్యల విషయాన్ని తప్పుబడుతూనే అదాని, మోదీ సంబంధాలపై నిలదీస్తున్నారు. బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. దీన్ని ఎప్పటికప్పుడు తిప్పుకొడుతోంది బీజేపీ. నేతలు ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ ఆరోపణలపై వివరణ ఇస్తున్నారు. కాంగ్రెస్, ఇతర విపక్షాల తీరుపై మండిపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలోత విరుచుకుపడుతోంది. ఈ రోజు (మార్చి 28) ఉదయం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ... ప్రధాని మోడీని అవమానించడం ద్వారా ఒబిసి సమాజాన్ని రాహుల్ గాంధీ అవమానిస్తున్నారని అన్నారు. మీరు నన్ను ఎంత కావాలంటే అంత అవమానించాలి కానీ దేశాన్ని కించపరచకండి అని ప్రధాని ఎప్పుడూ చెబుతుంటారు. కానీ కాంగ్రెస్, రాహుల్ గాంధీ మాత్రం దేశాన్ని అవమానిస్తున్నారన్నారు.
రాజకీయ రణరంగంలో మోదీపై రాహుల్ గాంధీ చిమ్మిన విషం దేశానికి అప్రతిష్టగా మారిందని స్మృతి ఇరానీ విమర్శించారు. ప్రధాని మోదీని అవమానిస్తున్నామన్న భ్రమలో మొత్తం ఓబీసీ సమాజాన్ని అవమానించడం సముచితమా అని ఆమె ప్రశ్నించారు. మోదీ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు రాహుల్ గాంధీ విదేశాల్లో అబద్ధాలు చెప్పారన్నారు. దేశంలో అబద్ధాలు చెప్పి... పార్లమెంటులో అబద్ధాలు చెప్పారని విమర్శించారు. సుప్రీం కోర్టు ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పిన వ్యక్తి పిరికివాడు కానట్టు నటిస్తున్నాడన్నారు.
ఓ పత్రికకు రాహుల్ గాంధీ ఇచ్చిన ఇంటర్వ్యూను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోడీ బలం తన ఇమేజ్ అని 4 మే 2019 న ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేప్పారన్నారు. ఆ ఇమేజ్‌ను నాశనం చేసే వరకు ప్రధాని మోడీ ఇమేజ్‌పై దాడి చేస్తూనే ఉంటానని రాహుల్ గాంధీ ప్రతిజ్ఞ చేశారన్నారు. గాంధీ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ ప్రతిష్టను దిగజార్చిందన్నారు.
నరేంద్ర మోడీపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదని స్మృతి ఇరానీ అన్నారు. పార్లమెంటులో ఆయన ఈ వ్యాఖ్య చేసినప్పుడు వాటిని రుజువు చేయాలంటే పారిపోయారన్నారు. రుజువు చేయలేకపోయారన్నారు. ఇటీవల భారత యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ స్మృతి ఇరానీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్మృతి ఇరానీ మంత్రగత్తెలా మారిందని కామెంట్ చేశారు. వీటిపై కూడా స్క్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్త చేశారు. కాంగ్రెస్ లో ప్రమోషన్ కోరుకునే వారు తనపై ఇలాంటి భాషలో మాట్లాడటం కొత్త కాదన్నారు. ఇదే మొదటి సారి కూడా కాదన్నారు.