Namibian Cheetah Died : నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతల్లో ఒకటైన సాశా పేరు గల ఆడ చిరుత సోమవారం కన్నుమూసింది. ఈ చిరుత మరణానికి కిడ్నీ సమస్య, డీహైడ్రేషన్ కారణమని అటవీ అధికారులు గుర్తించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా చిరుత సోమవారం ఉదయం మృతి చెందింది. అంతకుముందు జనవరిలో సాశా అస్వస్థతకు గురై చికిత్స పొందింది. అప్పట్లో వైద్యులు, భోపాల్‌కు చెందిన వెటర్నరీ నిపుణుల బృందం పరిశీలనలో సాశా ఉంది. సెప్టెంబరు 17, 2022న తన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ, మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్‌లో నమీబియా నుంచి తీసుకొచ్చిన మూడు ఆడ చిరుతలతో సహా ఎనిమిది చిరుతలను విడుదల చేశారు.
"నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతలను రోజూ పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో ఆడ చిరుత సాశా బలహీనంగా ఉందని గుర్తించాం. సాశాను వైద్యులు పరిశీలించి, ఆహారం అందించారు. అది బలహీనంగా ఉందని, మరింత వైద్యం అవసరమని భావించి మరిన్ని వైద్య పరీక్షలు చేయించాం’’ అని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌ఓ) ప్రకాష్ కుమార్ వర్మ తెలిపారు.
సాశాకు కిడ్నీ సమస్యలు
చిరుత సాశాకు వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో చిరుతకు డీహైడ్రేషన్ తో పాటు కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. భోపాల్ నుంచి వైద్యుల బృందాన్ని పిలిపించి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. సాశా అస్వస్థతకు గురైందనే వార్త తర్వాత, భోపాల్‌లోని వాన్ విహార్ నేషనల్ పార్క్ నుంచి వైద్యుల బృందాన్ని వాన్ విహార్ నేషనల్ పార్క్ హెడ్ వెటర్నరీ డాక్టర్ అతుల్ గుప్తా , అతని అసోసియేట్ డాక్టర్ల బృందం కునో పార్క్‌కు పిలిపించారు అధికారులు. జనవరి 22వ తేదీన చీతా ‘సాశా’ అస్వస్థతతో కనిపించింది. దీంతో వైద్య పరీక్షల కోసం క్వారంటైన్‌లోకి తరలించారు కునో నేషనల్ పార్క్ నిర్వాహకులు. రక్త పరీక్షలతోపాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో చిరుతకు మూత్రపిండాల సమస్య ఉన్నట్లు తేలింది. సాశా ఆరోగ్య చరిత్రను పూర్తిస్థాయిలో విశ్లేషిస్తే భారత్‌కు తీసుకొచ్చే ముందే ఈ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. స్థానిక వైద్యులతోపాటు నమీబియా, దక్షిణాఫ్రికాలకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో సాశాకు వైద్యసేవలు అందించారు. అయితే ఆరోగ్య విషమించి సోమవారం చీతా మరణించిందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
మరో 12 చిరుతలు
ఇటీవల నమీబియా నుంచి 4- 6 ఏళ్ల వయసు గల ఐదు ఆడ, మూడు మగ మొత్తం ఎనిమిది చిరుతలను దేశానికి తీసుకువచ్చారు. మరో ఏడు చీతాల్లో మూడు మగ, ఒక ఆడ చిరుత ప్రస్తుతం కునో జాతీయ పార్కులో సంచరిస్తున్నాయి. మిగతా ఏడు చీతాలు ఆరోగ్యంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన 12 చిరుతలు క్వారంటైన్‌లో ఆరోగ్యంగా ఉన్నాయని కునో అధికారులు ప్రకటించారు.