Jharkhand Political Crisis: ఝార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉండటంతో హేమంత్ సోరెన్ సీఎం పదవి నుంచి తప్పుకోనున్నారు. ఝార్ఖండ్ తదుపరి సీఎం ఎవరనే దానిపై అప్పుడే స్పష్టత వచ్చేసింది. జీఎంఎం ఎమ్మెల్యేలు చంపై సోరెన్‌ను లో శాసనపక్ష నేతగా ఎన్నుకున్నారు. దాంతో ఆయన ఝార్ఖండ్ తదుపరిసీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. తమ ఎమ్మెల్యేలు భేటీ అయి చంపై సోరెన్ ను శాసనసభా పక్షనేతగా ఎన్నుకున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ ఠాకూర్ మీడియాకు తెలిపారు.
సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. ఈ పరిస్థితుల్లో భార్య కల్పనా సోరెన్‌కు (Kalpana Soren)కు సీఎం పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అనూహ్యంగా కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేలు చంపై సోరెన్ ను శాసనసభా పక్షనేతగా బుధవారం రాత్రి ఎన్నుకున్నారు. దాంతో ఝార్ఖండ్ నూతన సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్ వీడింది.
ప్రభుత్వ భూమికి సంబంధించి దాదాపు రూ.600 కోట్ల స్కామ్ జరిగిందని ఈడీ చెబుతోంది. ఈ భూమిని కొందరు బిల్డర్స్‌కి సీఎం హేమంత్ సోరెన్ సంబంధిత వ్యక్తులు విక్రయించినట్టు ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇదివరకే 14 మందిని అరెస్ట్ కాగా, హేమంత్ సోరెన్ ను సైతం ఈడీ అరెస్ట్ చేస్తుందని ప్రచారం జరిగింది. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను జనవరి 20న ఈడీ విచారించింది. అయితే పూర్తిస్థాయిలో దర్యాప్తులో భాగంగా మరోసారి సోరెన్ ను అధికారులు విచారించనున్నారు. ఈడీ విచారణ తరువాత హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేస్తారని.. సీఎం స్థానంలో మరొకర్ని కూర్చోబెట్టాలని ఆయన భావించారు.
కల్పనా సోరెన్ వర్సెస్ సోతా సోరెన్..
హేమంత్ సోరెన్ జైలుకు వెళ్తే ఆయన భార్య కల్పనా సోరెన్ కు సీఎం పీఠం ఇవ్వాలని భావించారు. అయితే అసలు చిక్కు ఫ్యామిలీలోనే మొదలైంది. హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ను సీఎం చేస్తూ చూస్తూ ఊరుకునేది లేదని సీతా సోరెన్ బహిరంగ ప్రకటన చేశారు. సీతా సోరెన్ ఎవరంటే.. జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు. తనకు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉందని, ఏం చూసి కల్పనా సోరెన్ ను సీఎం చేస్తారని సీతా సోరెన్ ప్రశ్నించారు. మరోవైపు ప్రభుత్వం కూలిపోకుండా ఉండాలని, జేఎంఎం ఎమ్మెల్యేలు, మద్దతు పార్టీ ఎమ్మెల్యేలు చర్చించి శాసనసభాపక్ష నేతగా సీనియర్ నేత, ఝార్ఖండ్ మంత్రి చంపై సోరెన్ ను ఎన్నుకున్నారు.
కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేలు ఝార్ఖండ్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. తమను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని గవర్నర్ ను కోరారు. ఈడీ కస్టడీలో ఉన్న సీఎం హేమంత్ సోరెన్ రాజ్ భవన్ కు వెళ్లి తన పదవికి రాజీనామా చేశారని జేఎంఎం ఎంపీ మహువా మాజీ ఏఎన్ఐతో మాట్లాడుతూ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సభ్యుల మద్దతు తమకు ఉందని, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని కాంగ్రెస్, జేఎంఎం సభ్యులు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు. చంపై సోరెన్ కు రాష్ట్ర మంత్రిగా చేసిన అనుభవం ఉంది. దాంతో హేమంత్ సోరెన్ కుటుంబసభ్యులను కాదని, మంత్రి చంపై సోరెన్ ను శాసనసభా పక్షనేతగా కూటమి సభ్యులు ఎన్నుకున్నారు.