Karnataka Congress MLA Controversial Comments :  కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే HC బాలకృష్ణ ఐదు గ్యారంటీల అమలుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయకపోతే ప్రస్తుతం అమల్లో ఉన్న ఐదు గ్యారంటీలను రద్దు చేస్తామని హెచ్చరించారు. మగాడి నియోజవర్గ MLA బాలకృష్ణ బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. కానీ, కొందరు ఇప్పుడు అయోధ్య శ్రీరాముడి పేరుతో అక్షింతలు పంచుతున్నారని.. అక్షింతలు కావాలో, హామీల అమలు కావాలో ఎంచుకోవాలని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. 


అయోధ్య అక్షింతలు పంచి బీజేపీకి ఓట్లు అడుగుతున్నారన్న  కాంగ్రెస్ ఎమ్మెల్యే                 


దేవాలయాలను గౌరవిస్తాం కానీ.. వాటి పేరుతో ఓట్లు అడగడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు బాలకృష్ణ. ఒకవేళ అక్షింతలు కావాలనుకుంటే.. మేము ఐదు హామీలను రద్దు చేస్తామంటూ కామెంట్స్ చేశారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌తో మట్లాడానన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ప్రజలు అక్షింతలకే ఓటేస్తే.. కాంగ్రెస్‌ ఐదు హామీలను తిరస్కరిస్తున్నట్లేనని సీఎం, డిప్యూటీ సీఎంలకు చెప్పానన్నారు. వాటిని రద్దు చేసి, ఆ డబ్బును అభివృద్ధికి ఉపయోగించాలని వారికి సూచించినట్లు చెప్పారు.


ఓటర్లను బెదిరించడంపై బీజేపీ ఆగ్రహం                    


హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు బెదిరింపులకు దిగుతూ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటోందని కేంద్ర  మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. అభివృద్ధి పథకాలకు కత్తెర వేసిన కాంగ్రెస్.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. ఇప్పుడు బెదిరింపులకు దిగుతోందని ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ విషయాలన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి కచ్చితంగా బుద్ది చెబుతారని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.   





 కర్ణాటకలో ఐదు గ్యారంటీల అమలు                     


కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్(గృహజ్యోతి), ప్రతి కుటుంబంలోని మహిళలకు(గృహలక్ష్మి) నెలవారీ రూ. 2,000 సహాయం, దారిద్య్ర రేఖకు దిగువన (BPL) ఉన్న కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 10 కిలోల బియ్యం ఉచిత పంపిణీతో పాటు నిరుద్యోగ యువతకు నెలవారీ భత్యం రూ. 3,000.. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ డిప్లొమా హోల్డర్లకు రెండేళ్ల పాటు(యువనిధి) రూ. 1,500, అలాగే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులలో(శక్తి) మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి హామీలను అమలులోకి తీసుకొచ్చింది.