Jharkhand CM Hemant Soren Who Has Left His Anonymity: భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన రాంచీలో (Ranchi) ప్రత్యక్షమయ్యారు. తన అధికారిక నివాసంలో మంత్రులు, జేఎంఎం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆయన సతీమణి కల్పన కూడా హాజరు కావడంతో నాయకత్వం మారొచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో సోరెన్ నివాసంతో పాటు రాజ్ భవన్, ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు.
భార్యకు పగ్గాలు?
ఓవైపు ఈడీ విచారణ, మరోవైపు సీఎం అందుబాటులో లేకపోవడంతో ఝార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర నాయకత్వ మార్పు తప్పదనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో తాజాగా సోరెన్ అజ్ఞాతం వీడారు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా - జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలతో భేటీ కావడం, ఈ సమావేశంలో సోరెన్ భార్య కల్పన కూడా పాల్గొనడం ఆ ఊహాగానాలకు బలం చేకూరింది. సతీమణికి సీఎం సోరెన్ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
కార్లు, రూ.36 లక్షలు స్వాధీనం
భూకుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్ ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సోమవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు. 13 గంటలు ఎదురుచూసినా సోరెన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. అయితే, సీఎం నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు 2 బీఎండబ్ల్యూ కార్లు, పలు కీలక దస్త్రాలు, రూ.36 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి వరకూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 31న (బుధవారం) రాంచీలోని తన నివాసానికి రావాలని సోరెన్ ఇప్పటికే ఈడీ అధికారులకు సందేశం పంపారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన్ను ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈడీ అధికారులు విచారించేందుకు వెళ్లిన సమయంలో సోరెన్ అందుబాటులో లేకపోవడంతో 'సీఎం మిస్సింగ్' అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. సోరెన్ చిత్రంతో ఉన్న పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి, ఆయన గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.11 వేల రివార్డు ప్రకటించింది.
గవర్నర్ ఏమన్నారంటే.?
కాగా, ఝార్ఖండ్ లో తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ స్పందించారు. అందరిలాగే తాను కూడా సీఎం సోరెన్ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 'చట్టానికి ఎవరూ అతీతులు కాదు. రాజ్యాంగ పరిధిలోనే మనం పని చేయాలి. రాజకీయ విభేదాలతో నాకు సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదు.' అని పేర్కొన్నారు.
Also Read: Death Sentence: బీజేపీ నేత హత్య కేసు - 15 మందికి మరణ శిక్ష, కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు