15 Pfi Members Death Sentence in Kerala: బీజేపీ నేత హత్య కేసులో కేరళ సెషన్స్ కోర్టు (Kerala Sessions Court) మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. నిషేధిక పీఎఫ్ఐ సంస్థకు చెందిన 15 మంది సభ్యులను దోషులుగా నిర్ధారించిన అలప్పుజ (Alappuzha) ధర్మాసనం వారందరికీ ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. కాగా, ఓ కేసులో ఇంతమందికి మరణ శిక్ష విధించడం కేరళ చరిత్రలోనే ఇదే తొలిసారి. నిందితుల్లో 8 మందిపై హత్యాభియోగాలు, మిగిలిన వారిపై కుట్ర ఆరోపణలు రుజువైనట్లు న్యాయస్థానం తెలిపింది. ఈ నిందితులంతా శిక్షణ పొందిన కిల్లర్ స్క్వాడ్ అని, బీజేపీ నేతను కుటుంబ సభ్యుల కళ్ల ముందే దారుణంగా చంపేశారని ప్రాసిక్యూషన్ పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం దోషులకు మరణ శిక్ష విధించింది.


2021లో బీజేపీ నేత హత్య


2021, డిసెంబర్ 19న అలప్పుజలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ (Ranjith Sreeniavasan) దారుణ హత్యకు గురయ్యారు. పీఎఫ్ఐ, ఎస్ డీపీఐ కార్యకర్తలు ఇంట్లోకి చొరబడి అతనిపై దాడి చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు ఈ కేసులో 15 మందిని దోషులుగా నిర్ధారించింది.  కాగా, ఆ ఏడాది డిసెంబర్ 18న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) నాయకుడు కేఎస్ షాన్ ఇంటికి వస్తుండగా ఓ ముఠా చంపేసింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే రంజిత్ హత్య జరగడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.


నిందితులు వీరే


రంజిత్ హత్య కేసులో నైసమ్, అజ్మల్, అనూప్, అస్లమ్, కలామ్, సలాం, సఫారుద్దిన్, మన్సద్, జసీబ్ రాజా, నవాస్, సమీర్, నాజిర్, జాకిర్ హుస్సేన్, షాజీ పూవతుంగల్, షేర్నాన్ అష్రఫ్ నిందితులుగా ఉన్నారు. వీరంతా నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)లో సభ్యత్వం కలిగి ఉన్నారు. వీరందరికీ మరణశిక్ష విధించిన అలప్పుజ న్యాయస్థానం.. నిందితులకు అలప్పుజ మెడికల్ కాలేజీలో మెంటల్ ఎబిలిటీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. హత్య కేసులో తొలి 8 మంది నిందితులపై ఐపీసీ 302, 149, 449, 506, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరికి జీవిత కాల శిక్షతో పాటు ఉరి శిక్ష విధించారు. వీరితో పాటు మిగిలిన నిందితులకు మరణిశిక్ష ఖరారైంది.


Also Read: Crime News: దంపతుల అందమైన దోపిడీ- నమ్మినోళ్లకు వేశారు ఫేక్ ప్యాక్