Indian Navy Rescued 19 Pakistan Nationals in Arabian Sea: అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల చెర నుంచి పాకిస్థానీ నావికుల్ని భారత నేవీ (Indian Navy) రక్షించింది. 36 గంటల వ్యవధిలోనే 2 డేరింగ్ ఆపరేషన్స్ చేపట్టింది. ఆల్ నయీమి అనే పాకిస్థాన్ కు చెందిన ఫిషింగ్ నౌకపై సోమాలియాకు చెందిన 11 మంది దాడి చేశారు. అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన సుమారు 800 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్న పాక్ నౌకను దుండగులు చుట్టుముట్టారు. దీనిపై సమాచారం అందుకున్న భారత నేవీ వెంటనే అప్రమత్తమై.. 'ఐఎన్ఎస్ సుమిత్ర' యుద్ధనౌక సిబ్బందిని రంగంలోకి దింపింది. ఓడను అడ్డగించి సముద్రపు దొంగలను తరిమికొట్టి 19 మంది పాకిస్థానీ నావికుల్ని రక్షించింది. ఈ మేరకు ఇండియన్ నేవీ ఓ ప్రకటన చేసింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఇండియన్ నేవీకి చెందిన మెరైన్ కమాండోలు పాల్గొన్నారు. 










ఇరాన్ బోటునూ రక్షించిన ఆర్మీ


అయితే, ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడానికి కొద్ది గంటల ముందే భారత నేవీ మరో డేరింగ్ ఆపరేషన్ చేపట్టింది. శనివారం రాత్రి అరేబియా సముద్రంలో ఇరాన్ కు చెందిన చేపల బోటు ఇమాన్ ను సోమాలియా దొంగలు అపహరించారు. దీనిపై ఆదివారం భారత నౌకాదళానికి అత్యవసర సందేశం అందింది. ఈ క్రమంలో ఐఎన్ఎస్ సుమిత్ర, అడ్వాన్సుడ్ లైట్ హెలికాఫ్టర్ ధ్రువ్ ను రంగంలోకి దించింది. భారత నేవీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి 17 మంది మత్స్యకారులను రక్షించారు.









కాగా, హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హూతీ తిరుగుబాటుదారులు గత కొద్ది రోజులుగా ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో ఆయిల్ ట్యాంకర్లతో వెళ్తున్న మార్లిన్ లాండ నౌకపై క్షిపణితో దాడి జరగ్గా.. ఆ నౌక అత్యవసర సందేశానికి భారత నేవీ స్పందించింది. సమీపంలోని ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టింది.


Also Read: Indian Railway News : రైల్వే ప్రయాణికులకు మరో షాకింగ్ న్యూస్- ఇకపై అలాంటి సర్దుబాటు కుదరదు