Budget 2024: భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, 01 ఫిబ్రవరి 2024న గురువారం నాడు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తారు. బడ్జెట్‌ డే దగ్గర పడడంతో దేశం అంతటా ఆర్థిక చర్చలు జరుగుతున్నాయి. నిర్మలమ్మ తీసుకొచ్చేది 'ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌' (Vote-on-Account Budget) కాబట్టి, ఈ పద్దులో పెద్ద మార్పులు-చేర్పులు ఉండకపోవచ్చు. 


2024 సార్వత్రిక ఎన్నికల ‍‌(2024 General Election) తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం, జులై నెలలో సమగ్ర బడ్జెట్‌ను విడుదల చేస్తుంది. అప్పుడు, దేశం ఊహించిన అంచనాలు, సర్దుబాట్లకు అవకాశం ఉంటుంది. 


మధ్యంతర బడ్జెట్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎలా చూడాలి? ‍‌(When and how to watch Budget 2024 live?)


2024 మధ్యంతర బడ్జెట్‌ను ఫిబ్రవరి 01న, ఉదయం 11 గంటలకు ‍‌(Budget 2024 Date and Time), కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి ప్రసంగం.. అధికారిక పార్లమెంటరీ ఛానెల్‌ సంసద్ టీవీ (Sansad TV) ద్వారా యూట్యూబ్‌లో (YouTube) ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. యూట్యూబ్‌ చూడదగిన ఎలక్ట్రానిక్‌ పరికరం మీ దగ్గర ఉంటే, బడ్జెట్‌ సెషన్‌ను మీరు లైవ్‌లో చూడవచ్చు. ఛానెల్‌ లింక్ ఇది: YouTube.com/@SansadTV.


ఒకవేళ, బడ్జెట్‌ ప్రసంగాన్ని మీరు టీవీలో చూడాలనుకుంటే... దూరదర్శన్, సంసద్ టీవీ ఛానెల్స్‌కు వెళ్లవచ్చు.


ABP లైవ్ బడ్జెట్ ప్రెజెంటేషన్‌లో అన్ని తాజా సమాచారాలు, విశ్లేషణలు, ప్రత్యక్ష ప్రసారాలను చూడొచ్చు. ఇందుకోసం https://telugu.abplive.com/ ను చూడండి.


2024 బడ్జెట్‌ పత్రాన్ని (Budget 2024 Official Document) ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి?


మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు సమర్పించడం పూర్తయిన తర్వాత, ఆ అధికారిక పత్రం యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ (Union Budget mobile app) ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తుంది, అక్కడి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి;  iOS యూజర్లు యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు, www.indiabudget.gov.in ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్స్‌ నుంచి అధికారిక పత్రం వరకు ప్రతిదీ పొందొచ్చు.


మధ్యంతర బడ్జెట్‌ నుంచి ఏం ఆశించొచ్చు? ‍‌(Budget 2024 Expectations)


అతి త్వరలో ప్రారంభమయ్యే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, మోదీ 2.0 ప్రభుత్వంలోని చివరి బడ్జెట్‌లో ప్రజాకర్షక అంశాలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. 2023 డిసెంబర్‌లో ముగిసే ఉచిత ఆహార కార్యక్రమాన్ని పొడిగిస్తామని, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, గత నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రకటించారు. దీనివల్ల 81.35 కోట్ల మంది లబ్ధి పొందుతారని అప్పట్లో హామీ ఇచ్చారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు మద్దతుగా నిలిచే లక్ష్యంతో ఈ పొడిగింపు ఉంటుందని చెప్పారు. ఉచిత ఆహార కార్యక్రమం పొడిగింపుపై బడ్జెట్‌లో ప్రకటన ఉండొచ్చు. దీంతోపాటు.. ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలను ఇంకా కొనసాగించడం, కొత్త ప్రజాకర్షక నిర్ణయాలు ప్రకటించడం వంటివి ఉండొచ్చు. సబ్సిడీలు, ఉపాధి కార్యక్రమాలు, జల ప్రాజెక్టులు, విద్యా సంస్కరణల కోసం కూడా బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 


మరో ఆసక్తికర కథనం: ఫ్యామిలీ పెన్షన్‌ రూల్స్‌లో సంచలన మార్పు, భర్తలకు భారీ షాక్‌