'జట్టి కలగ' ఈ పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది రక్తం చిందించేలా చేసే మల్ల యుద్ధం. కర్ణాటకలోని మైసూరు నగరంలో దసరా నవరాత్రుల సందర్భంగా చివరి రోజైన విజయదశమి రోజున ఈ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలు ఎందుకు నిర్వహిస్తారు.?, ప్రాధాన్యత, దీని వెనుక కథ వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.


రక్తం చిందించే మల్ల యుద్ధం


'జట్టి కలగ' ప్రత్యర్థి రక్తం చిందించేలా సాగే మల్ల యుద్ధం. వీటిని వజ్రముష్టి కలగ పోటీలు అని కూడా పిలుస్తారు. ఈ క్రీడలో తమ ప్రత్యర్థులను రక్తం చిందించేలా చేసి ఓడించాల్సి ఉంటుంది. గుండు గీయించుకుని, వేళ్లలో ఇమిడిపోయే చిన్నపాటి ఇనుప ఆయుధాన్ని ధరించి ముష్టి యుద్ధం చేస్తారు. ఎవరికి ముందుగా రక్తస్రావం అవుతుందో వారు ఓడినట్లు తేలుస్తారు.


పోటీలో ఇద్దరే


ఈ పోటీలు నిర్వహించే ముందు జమ్మిచెట్టుకు పూజ చేస్తారు. దసరా జంబూ సవారీ నిర్వహిస్తారు. జట్టి కుటుంబీకులు, వంశస్థులు ఈ పోటీల్లో భాగమవుతారు. ఇద్దరేసి చొప్పున ఈ పోటీలో తలపడుతుంటారు. ఇప్పటికీ అప్పటి సంప్రదాయాలను మైసూర్ రాజవంశం పాటిస్తోంది.


నిర్వహణ ఇలా


ప్రస్తుతం మైసూర్, చామరాజనగర్, బెంగుళూరు ప్రాంతాల్లో జట్టీలు నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో నగరం నుంచి ఇద్దరేసి చొప్పున ఎంపిక చేసి వారిని పోటీలకు పంపుతారు. అందులో నుంచి ఇద్దరేసి చొప్పున ఉండే రెండు జట్లను ఎంపిక చేస్తారు. రెండు జట్టీల బృందాలను స్టాండ్ బైలుగా ఉంచుతారు. మైసూర్ మహారాజు, రాణి ముందు వీరిని హాజరు పరిచి వారి అనుమతితో పోటీలు నిర్వహిస్తారు. ఒకసారి పోటీ పడిన జట్టీలు వచ్చే ఏడాది పోటీ పడేందుకు అనుమతివ్వరు. ఎంపికైన 4 బృందాలకు 45 రోజుల ముందుగానే ప్రత్యేక శిక్షణ ఇస్తారు.


పోటీల వెనుక చరిత్ర


'జట్టి కలగ' పోటీల వెనుక పెద్ద చరిత్రే ఉంది. మహా భారతంలో శ్రీకృష్ణుడి కాలం నుంచి ఈ పోటీలు నిర్వహిస్తున్నారని ప్రతీతి. పోటీల్లో పాల్గొనే వారిని జట్టిలని పిలుస్తారు. వీరు కుస్తీ పట్టే ప్రదేశాన్ని 'కన్నడి తొట్టి' అని పేర్కొంటారు. వడియార్ రాజవంశ పాలనలో ఈ పోటీలు ఎక్కువగా సాగుతుండేవి. యదువంశ రాజులు ఏమైనా విజయాలు సాధించిన తర్వాత నిర్వహించే ఊరేగింపుల సమయంలోనూ 'జట్టి కలగ' పోటీలను నిర్వహిస్తారు.