కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన సోదాల్లో ఐటీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని ప్రభుత్వ కాంట్రాక్టర్లు, నగల వ్యాపారులు, బిల్డర్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహించగా భారీగా బంగారం, నగదు పట్టుబడినట్లు సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు) సోమవారం వెల్లడించింది. అక్టోబర్ 12 నుంచి కొనసాగించిన ఐటీ దాడుల్లో రూ.94 కోట్ల నగదుతో సహా రూ.8 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, 30 లగ్జరీ వాచెస్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీటి మొత్తం విలువ రూ.102 కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు.


55 చోట్ల తనిఖీలు


కర్ణాటక, ఢిల్లీ, బెంగుళూరుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో మొత్తంగా 55 చోట్ల తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. కర్ణాటకలో ఓ కాంట్రాక్టర్ తో పాటు అతని కొడుకు, జిమ్ ఇన్ స్ట్రక్టర్, ఆర్కిటెక్ట్ సహా పలువురి నివాసాలపై దాడి చేసినట్లు ఐటీ అధికారులు వివరణ ఇచ్చారు.


ఆధారాలు స్వాధీనం


ఈ సోదాల్లో డిజిటల్ డేటా, హార్డ్ కాపీల రూపంలో ఉన్న సాక్ష్యాలను భారీగా స్వాధీనం చేసుకున్నట్లు సీబీడీటీ అధికారులు వెల్లడించారు. కాంట్రాక్టర్లు ఖర్చును ఎక్కువగా చూపించి ఆదాయం తక్కువగా చూపించేందుకు యత్నించారని పేర్కొన్నారు. సబ్ కాంట్రాక్టర్ల ద్వారా నకిలీ కొనుగోళ్లకు తెర లేపారని, లెక్కల్లోకి రాని నగదు చాలా ఉందని స్పష్టం చేశారు. 


బీజేపీ ఆరోపణలు


ఐటీ సోదాలపై కర్ణాటకలో అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం రేగింది. ఐటీ అధికారులు సీజ్ చేసిన నగదు కాంగ్రెస్ పార్టీకి చెందినదేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని ఏటీఎంలా వాడుకోవడం కాంగ్రెస్ కు కొత్తేమీ కాదని, అది ఇంత త్వరగా జరగడం ఆశ్చర్యంగా ఉందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. రాహుల్ గాంధీ దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.






తెలంగాణలోనూ


మరో వైపు, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖ తనిఖీల్లోనూ భారీగా నగదు పట్టుబడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రూ,కోట్లలో పోలీసులు అక్రమ నగదు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం హైదరాబాద్ గాంధీనగర్ పరిధిలోని కవాడీగూడలో నిర్వహించిన తనిఖీల్లో రూ.2.09 కోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వనస్థలిపురంలో ఎల్బీ నగర్ SOT పోలీసులు కారులో తరలిస్తోన్న రూ.29.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ లోనూ 27 కేజీల బంగారం, 15 కిలోల వెండి సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మాదాపూర్ లో రూ.32 లక్షల నగదు, గచ్చిబౌలి పరిధిలో మరో రూ.10 లక్షలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.