ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా వరుస భూకంపాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే ఢిల్లీలో భూకంపం సంభవించగా అది మరువక ముందే సోమవారం ఉత్తరాఖండ్ లో భూప్రకంపనలు రేగాయి. ఉదయం 9:11 గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది. పితోర్ ఘర్ కు ఈశాన్యంగా 48 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.


ఇటీవలే నేపాల్ లో


ఇటీవలే నేపాల్ లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఢిల్లీ, పంజాబ్, హరియాణా, యూపీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.


ఢిల్లీలో 3.1 తీవ్రతతో


ఢిల్లీ, NCR ప్రాంతాల్లో ఆదివారం 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 10 కిలో మీటర్ల లోతు వరకూ ఈ భూకంప ప్రభావం కనిపించినట్టు అధికారులు వెల్లడించారు. ఫరియాబాద్‌కి 9 కిలో మీటర్ల దూరంలో భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కాగా, భూప్రకంపనలతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కపడ్డారు. వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈ నెలలోనే ఢిల్లీలో భూకంపం రావడం ఇది రెండోసారని, అక్టోబర్ 3న కూడా ఇలానే భూమి కంపించినట్లు వెల్లడించారు.


నాలుగో జోన్ లో ఢిల్లీ


దేశ రాజధాని ఢిల్లీ నాల్గో భూకంప జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతం భూకంపాలకు గురయ్యే అధిక రిస్క్ జోన్లలో ఒకటి. ఆగస్టు 5న ఆఫ్ఘనిస్తాన్‌లో 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో 181 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అప్పట్లో తెలిపింది.