ISRO Scientists Salary: 


ఇస్రో సైంటిస్ట్‌ల జీతాలెంతంటే..


చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యాక ఇస్రో పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. "అద్భుతం" చేశారంటూ అన్ని దేశాలూ ప్రశంసిస్తున్నాయి. ఇక భారత్‌లో అయితే ఆ సైంటిస్ట్‌లను హీరోలుగా చూస్తున్నారు. కేవలం రూ.613 కోట్లతోనే ఈ ఘన విజయం సాధించారు శాస్త్రవేత్తలు. అందుకే సినిమా బడ్జెట్‌లతో పోలుస్తూ మరీ పొగుడుతున్నారు. ఇదే క్రమంలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. దేశ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయే విజయాన్ని అందించిన ఈ శాస్త్రవేత్తల జీతాలెంత..? (ISRO Scientists Salary) అని ఆరా తీయడం మొదలు పెట్టారు అంతా. చంద్రయాన్ 3 సక్సెస్ అయినప్పటి నుంచి డిస్కషన్ జరుగుతోంది. సాధారణంగా కార్పొరేట్‌లో ఎక్స్‌పీరియెన్స్ ఆధారంగా జీతాలిస్తుంటారు. కానీ...ఇస్రోలో అనుభవంతో పాటు మరి కొన్ని అర్హతలూ ఉండాలి. అలాంటి వాళ్లకే ఎక్కువ జీతాలొస్తాయి. వాళ్లు పని చేసే ప్రాంతం, డిసిగ్నేషన్, ఎడ్యుకేషనల్ బ్యాగ్రౌండ్, ఎక్స్‌పీరియెన్స్..ఇలా చాలా రకాలుగా బేరీజు వేసుకుని జీతాలు నిర్ణయిస్తారు. బేసిక్ మంత్లీ శాలరీ రూ.15 వేల నుంచి మొదలవుతుంది. రూ.40 వేల వరకూ జీతాలుంటాయి. మొత్తంగా చూస్తే రూ.15-40వేల మధ్యలోనే సైంటిస్ట్‌ల జీతాలుంటాయి. ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లు నిర్వహించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌ని ఎంపిక చేసుకుంటుంది ఇస్రో. అది కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీలకు చెందిన వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. 7th Pay Commission సూచనల ఆధారంగానే జీతాలు నిర్ణయిస్తారు. 


మాధవన్ నాయర్ కీలక వ్యాఖ్యలు..


అయితే వీళ్ల జీతాలపై చర్చ జరుగుతున్న ఈ సమయంలో ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల అంతరిక్ష సంస్థలతో పోల్చుకుంటే ఇస్రో ఇచ్చే జీతాలు 5 రెట్లు తక్కువ అని తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఐదింట ఒక వంతు మాత్రమే ఇస్రో సైంటిస్ట్‌లకు వేతనాల రూపంగా అందుతోందని వెల్లడించారు. ఈ కారణంగానే ఇస్రో శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చులోనే అనుకున్న ప్రాజెక్ట్‌ని పూర్తి చేయాల్సి వస్తోందని స్పష్టం చేశారు. ఇస్రో సైంటిస్ట్‌లలో ఒక్కరు కూడా లక్షాధికారి లేరని, చాలా సింపుల్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారని తెలిపారు. 


"ఇస్రో సైంటిస్ట్‌లలో ఒక్కరు కూడా లక్షాధికారి లేరు. వీళ్లంతా చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు. కానీ ఎప్పుడూ వాళ్లు డబ్బు గురించి ఆలోచించరు. మిషన్ పూర్తి చేసేంత వరకూ చాలా శ్రమిస్తారు. అంకిత భావంతో పని చేస్తారు. అందుకే ఇంత ఘన విజయాలు సాధించగలుగుతున్నారు. స్పేస్ మిషన్స్ కోసం భారత్ పూర్తిగా దేశీయ టెక్నాలజీనే వాడుతోంది. అందుకే ఖర్చు తక్కువవుతోంది. ఇతర దేశాల స్పేస్ మిషన్స్‌తో పోల్చి చూస్తే భారత్ 50-60% తక్కువ ఖర్చులోనే పూర్తి చేస్తోంది. చంద్రయాన్ 3 సక్సెస్‌తో భారత్‌ కుంభస్థలం బద్దలు కొట్టింది. ప్రపంచ దేశాలకు మనం కూడా టెక్నికల్‌గా కాంపిటీషన్‌ ఇచ్చే స్థాయికి చేరుకున్నాం. భవిష్యత్‌లో ఇస్రో మరింత శక్తిమంతమవుతుందన్న నమ్మకం ఉంది"


- మాధవన్ నాయర్, ఇస్రో మాజీ చీఫ్ 


Also Read: Low Rainfall: దేశంలో 2002 నాటి పరిస్థితులు, వచ్చే రెండు వారాలే కీలకమంటున్న వాతావరణ శాఖ