Rice Production: ఈ సీజన్‌లో భారతదేశంలో వాతావరణ పరిస్థితులు చాలా విరుద్ధంగా ఉన్నాయి. వర్షాలు, వరదలతో ఉత్తర భారతదేశం నానిపోతుంటే, వర్షం చుక్క లేక దక్షిణ భారతదేశంలో భూమి బీటలు వారుతోంది. ఈ ప్రభావం నేరుగా వరి సాగు మీద, తద్వారా బియ్యం ఉత్పత్తి మీద పడబోతోంది. 


భారత ప్రజల ముఖ్యమైన ఆహారమైన బియ్యం ఉత్పత్తి ఈ సంవత్సరం 5 శాతం వరకు తగ్గవచ్చు. మన దేశంలోని వరి పంట వేసే పశ్చిమ బంగాల్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్‌లో అసమాన వర్షాల కారణంగా ఈ సంవత్సరం వరి ఉత్పాదకత దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణం. 


ఈ ఏడాది అతివృష్టి, అనావృష్టి రెండు రకాల పరిస్థితులు కనిపిస్తుండడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వరి నాట్లు ఆలస్యమయ్యాయి. దీనివల్ల వరి సాగు వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది, బియ్యం ఉత్పత్తిపై ఆందోళన నెలకొంది. ఎల్ నినో (El Nino) ప్రభావంతో పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, FY24లో (2023-24 ఆర్థిక సంవత్సరం), ప్రపంచ వ్యాప్తంగా బియ్యం ఉత్పత్తిలో 7 మిలియన్ టన్నుల కొరత ఏర్పడుతుందని అంచనాలు ఉన్నాయి. దీంతో, గ్లోబల్‌గా బియ్యం రేట్లు ఇంకా పెరుగుతాయని (ఇప్పటికే భారీగా పెరిగాయి) అంచనా. బియ్యం ఉత్పత్తి తగ్గుతుందన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లలోనే కాకుండా దేశీయంగానూ ధరలు పెరిగే అవకాశం ఉంది.


ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే ఉపాయం
వ్యవసాయ పరిశోధనలు చేసే జాతీయ సంస్థ 'ఐకార్‌' (Indian Council of Agricultural Research - ICAR), స్వల్పకాలిక వరి పంట వేయాలని పశ్చిమ బంగాల్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల రైతులకు సూచించింది. తద్వారా, రుతుపవనాల ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవచ్చు, వివిధ రకాల వరి ఉత్పత్తిని పెంచవచ్చని చెప్పింది. ఉదాహరణకు, 90-110 రోజుల్లో సిద్ధమయ్యే వరి రకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. దీనివల్ల, 160-200 రోజుల్లో వచ్చే పంట దెబ్బతిన్నా, 90-110 రోజుల్లో వచ్చే వరి పంట వల్ల కొంత ఉపశమనం పొందవచ్చని వెల్లడించింది.


ఒడిశాతో పాటు భారతదేశ తూర్పు రాష్ట్రాల్లో తక్కువ వర్షాలు
వ్యవసాయ మంత్రిత్వ శాఖ మూడో ముందస్తు అంచనా ప్రకారం.. 2023 ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఖరీఫ్ బియ్యం ఉత్పత్తి 110.032 మిలియన్ టన్నులుగా ఉంది. వరి పంటకు రానున్న రోజులు చాలా ముఖ్యమైనవని. ఇప్పటికైనా మంచి వర్షాలు కురిస్తే నీటి కొరత తీరుతుందని ఐకార్‌ అభిప్రాయపడింది. వర్షాలు బాగా పడితే.. ఇప్పటికే వేసిన వరి నాట్ల ఎదుగుదల, సాగుకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఒడిశాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి నాట్లు ఇప్పటికే ఆలస్యం అయ్యాయి. అదే సమయంలో, దేశంలోని తూర్పు ప్రాంతంలో వరిని సాగు చేసే చాలా రాష్ట్రాలు కూడా తక్కువ వర్షపాతం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నాయి.


బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం 
దేశంలోని ప్రతికూల పరిస్థితుల కారణంగా బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. FY23లో, భారతదేశం మొత్తం ఎగుమతుల్లో 30 శాతం వాటా కలిగిన బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. 


మరో ఆసక్తికర కథనం: పండుగల సీజన్‌ ఎఫెక్ట్‌, సెప్టెంబర్‌లో బ్యాంకులకు చాలా సెలవులు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial