ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు, గుండెపోటు వంటివి దాడి చేస్తున్నాయి. వయసుతో కూడా సంబంధం లేకుండా యువత కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే గుండె కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తగినంత నిద్ర, సరైన ఆహారం, వ్యాయామం ద్వారా గుండెను కాపాడుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను తగ్గించడం ద్వారా, మరికొన్ని రకాల ఆహారాలను తినడం ద్వారా గుండెను కాపాడుకోవచ్చు.


ఎంతోమంది యువత ఎలాంటి లక్షణాలు చూపించకుండా హఠాత్తుగా డాన్స్ చేస్తూ కుప్పకూలడం లేదా జిమ్ చేస్తూ గుండెపోటుకు గురవడం అనేది చూస్తూనే ఉన్నాం. ఇంతకుముందు గుండెపోటు కొన్ని లక్షణాలను చూపించేది. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడం అక్కడ నుంచి ఎడమ చేతికి లేదా దవడకు పాకడం, విపరీతంగా చెమటలు పట్టడం, ఆయాసం రావడం వంటివి గుండెపోటు లక్షణాలుగా ఉండేవి. కానీ ఈ మధ్య ఎలాంటి లక్షణాలు చూపించకుండానే వచ్చేస్తోంది. అందుకే గుండె కోసం ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాలి.


పొగ తాగడం, వ్యాయామం చేయకుండా, ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవడం, ఊబకాయం, మధుమేహం వంటివన్నీ కూడా గుండె సమస్యలు లేదా గుండెపోటు వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. అధిక ఒత్తిడి బారిన పడిన వారు కూడా గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారంలో అధికంగా కొవ్వు తీసుకోవడం వల్ల కూడా గుండె సమస్యలు వస్తాయి. అధికరక్తపోటు అదుపులో ఉండకపోయినా గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.


గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా రావాలంటే చేపలు అధికంగా తీసుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. చేపల్లో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగు పరుస్తాయి. గుండె ఆరోగ్యానికి ఒమేగా 3  ఫ్యాటీ ఆమ్లాలు చాలా అవసరం. కాబట్టి వారానికి కనీసం మూడు సార్లు చేపలు తినేందుకు ప్రయత్నించండి. అలాగే ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు కూడా గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోదు. దీనివల్ల గుండెకు రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. గుండె ఆగిపోయే పరిస్థితి ఏర్పడదు. ఆకుకూరలు తినడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు కూడా దరి చేరవు. పాలకూర, కొత్తిమీర వంటివి అధికంగా తింటూ ఉండాలి. ముల్లంగిని కూడా తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో కొవ్వు శాతం చాలా తక్కువ. అలాగే ఫోలిక్ ఆమ్లం, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం వంటివి అధికంగా లభిస్తాయి. ఇవన్నీ కూడా గుండె పనితీరును మెరుగు పరుస్తాయి. ఈ పదార్థాలు ప్రతిరోజూ ఆహారంలో తినేందుకు ప్రయత్నించాలి. అలాగే కనీసం రోజులో గంటసేపు వ్యాయామం చేసేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల మిగతా వారితో పోలిస్తే గుండెపోటు వచ్చే అవకాశం పది శాతం తగ్గిపోతుంది. 


Also read: ముప్పై అయిదేళ్ల వయసు దాటాక స్త్రీ గర్భం దాలిస్తే ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుందా?











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.