తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచ‌ర్ పోస్టుల‌ను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిన సంగ‌తి తెలిసిందే. డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ ఆగస్టు 25న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ప్రధానంగా ఎస్‌జీటీ-2,575 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్‌-1739 పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.


జిల్లాలవారీగా ఖాళీలు ఇలా..
ప్రభుత్వం ప్రకటించిన 5,089 ఉపాధ్యాయ ఖాళీల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో 358 పోస్టులు ఖాళీగా ఉండగా.. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 43 ఖాళీలు ఉన్నాయి. ఇక ఆదిలాబాద్-275, ఆసిఫాబాద్-289, భద్రాద్రి 185, హనుమకొండ-54, జగిత్యాల-148, జనగామ-76, జయశంకర్ భూపాలపల్లి-74, జోగులాంబ-146, కామారెడ్డి-200, కరీంనగర్-99, ఖమ్మం-195, మహబూబాబాద్-125, మహబూబ్‌నగర్-96, మంచిర్యాల-113, మెదక్-147, మేడ్చల్-78, ములుగు-65, నాగర్‌కర్నూలు-114, నల్గొండ-219, నారాయణపేట-154, నిర్మల్-115, నిజామాబాద్-309, పెద్దపల్లి-43, రాజన్నసిరిసిల్ల-103, రంగారెడ్డి-196, సంగారెడ్డి-283, సిద్ధిపేట-141, సూర్యాపేట-185, వికారాబాద్-191, వనపర్తి-76, వరంగల్-138, యాదాద్రి-99 పోస్టులు ఉన్నాయి.


ALSO READ:


గురుకుల ఒప్పంద ఉపాధ్యాయులకు తీపికబురు, క్రమబద్ధీకరణకు ప్రభుత్వ ఆమోదం
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని కాంట్రాక్టు టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించించింది. రాష్ట్రంలోని ఎస్సీ సంక్షేమ గురుకుల సొసైటీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయుల సర్వీసులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఈ మేరకు 567 మంది ఒప్పంద టీచర్ల క్రమబద్ధీకరణ దస్త్రంపై శుక్రవారం(ఆగస్టు 25) సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయుల రెగ్యులరైజ్ చేసేందుకు సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. 


గత 16 ఏళ్లుగా ఒప్పంద టీచర్లు గురుకులాల్లో పనిచేస్తున్నారు. ఇటీవల జనరల్‌ గురుకుల సొసైటీ పరిధిలో పనిచేస్తున్న 137 మంది సర్వీసులను ప్రభుత్వం క్రమబద్ధీకరించి, ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఎస్సీ గురుకులాల్లో టీచర్లను రెగ్యులరైజ్‌ చేసిన ప్రభుత్వం రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. ఎస్సీ సంక్షేమ గురుకులాల ఒప్పంద ఉపాధ్యాయుల సర్వీసును సీఎం కేసీఆర్‌ క్రమబద్ధీకరించడం పట్ల ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే మెరుగైన విద్యను అందిస్తున్న ఏకైక తెలంగాణ రాష్ట్రం అన్నారు.


అంగన్వాడీలకు గుడ్‌న్యూస్, కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం-విషయం ఏంటంటే?
తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,989 మినీ అంగన్వాడీలను కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచింది. ఉద్యోగ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది. అదేవిధంగా మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగ విరమణ తర్వాత టీచర్లు, హెల్పర్లకు ఆసరా పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీల స్థాయి పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..