చంద్రయాన్-3లో భాగమైన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ భుజం తట్టి అభినందించారు. దక్షిణాఫ్రికా గ్రీస్ పర్యటన ముగించుకొని నేరుగా ఇస్రో చేరుకున్నారు ప్రధానమంత్రి. అక్కడ ఆయనకు శాస్త్రవేత్తలు ఘనస్వాగతం పలికారు.
ముందుగా బెంగళూరులోని హాల్ విమానాశ్రయంలో దిగిన మోదీ అక్కడ కాసేపు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి ఇస్రో చేరుకున్నారు. అక్కడ ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌కు చేరుకున్నారు. అక్కడే శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రసంగించారు
అంతకు ముందు దక్షిణాఫ్రికా గ్రీన్ నుంచి నేరుగా బెంగళూరు వచ్చారు ప్రధానమంత్రి. ప్రపంచమే ఆశ్చర్యపోయే విజయాన్ని సొంత చేసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలను నేరుగా అభినందించాలని ప్రధాని నిర్ణయించుకున్నారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన తర్వాత తన షెడ్యూల్‌ను పూర్తి గా మార్చేశారు. నేరుగా ఢిల్లీ రాకుండా బెంగళూరులో ల్యాండ్ అయ్యారు.
గ్రీస్ పర్యటన ముగించుకొని బెంగళూరు వచ్చిన ప్రధానమంత్రి మోదీకి ఘనస్వాగతం లభించింది. అక్కడ ఎయిర్‌పోర్టుల దిగిన వెంటనే స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జై విజ్ఞాన్... జై అనుసంధాన్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. ఇది శాస్త్రవేత్తలకు మరింత బూస్టు అవుతుందన్నారు.
బెంగళూరు వచ్చిన ప్రధానమంత్రిని ఆహ్వానించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎంగానీ, డిప్యూటీ సీఎంగానీ ఎవరూ రాలేదు. దీనిపై మోదీ మాట్లాడుతూ... శాస్త్రవేత్తలతో సమావేశమై వెళ్లిపోతాను కాబట్టి నేనే ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు రావద్దని చెప్పాను.
ప్రధానమంత్రిని ఆహ్వానించడానికి ఎందుకు వెళ్లలేదని ప్రభుత్వ వర్గాలను అడిగితే... ప్రధాని వస్తున్నట్టు తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని చెప్పుకొచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఇస్రో చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు.
బెంగళూరులో ల్యాండ్ అవుతున్న టైంలో ఓ ట్వీట్ చేశారు ప్రధాని. చంద్రయాన్ -3 విజయంతో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన శాస్త్రవేత్తలను కలుస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. స్పేస్ సెక్టార్లో మరిన్ని అద్భుతాలు సాధించి దేశాన్ని నడిపించడానికి శాస్త్రవేత్తల డెడికేషన్ డ్రైవింగ్ ఫోర్సుగా ఉంటుందన్నారు.