ISRO PSLV C56: భారత అంతరిక్షణ పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధం అవుతోంది. ఈ నెల 30వ తేదీన పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగాన్ని చేపట్టేందుకు అన్ని సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ నెల 30వ తేదీన ఉదయం 6.30 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్ కు చెందిన డీఎస్-ఎస్ఏఆర్ శాటిలైట్ తో పాటు మరో ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో సోమవారం ప్రకటించింది. సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలకు ఉపగ్రహ ఛాయాచిత్రాల అవసరాల నిమిత్తం డీఎస్-ఎస్ఏఆర్ ను ప్రయోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. డీఎస్-ఎస్ఏఆర్ తోపాటు టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ మైక్రో శాటిలైట్ వెలాక్స్-ఏఎం, ఎక్స్‌పెరిమెంటల్ శాటిలైట్ ఆర్కేడ్, 3యూ నానోశాటిలైట్ స్కూబ్-2, ఐవోటీ కనెక్టివిటీ నానోశాటిలైట్ నూలయన్, గలాసియా-2, ఓఆర్బీ-12 స్ట్రైడర్ శాటిలైట్లను కూడా రోదసిలోకి పంపనుంది ఇస్రో. 






విజయవంతంగా సాగుతున్న చంద్రయాన్-3 ప్రయోగం


చంద్రయాన్ -3 కక్ష్యను మరోసారి పెంచనున్నారు. ఈ నెల 25వ తేదీన ఐదో సారి చంద్రయాన్ కక్ష్య దూరాన్ని పెంచేందుకు శాస్త్రవేత్తలు సన్నద్ధమయ్యారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో.. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 14వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్-3 (Chandrayaan 3) మిషన్ లో భాగంగా కక్ష్య పొడగింపు చేపట్టనున్నారు. 25వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య ఈ ఆపరేషన్ చేపట్టనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. భూమికి సంబంధించిన కక్ష్యలో ఆఖరిసారిగా చేపట్టే ఆపరేషన్ తో చంద్రయాన్ -3 భూమి నుంచి విశ్వంలో చంద్రుడికి చేరుకునే దిశగా ప్రయాణం మొదలుపెట్టనుంది. ఆగస్టు 1వ తేదీ నాటికి చంద్రయాన్ -3 లూనార్ ఆర్బిట్ (చంద్ర కక్ష్య)కు చేరుకుంటుంది. అక్కడి నుంచి 17 రోజుల పాటు చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఆగస్టు 23వ తేదీన చంద్రునికి 30 కిలోమీటర్ల ఎత్తులో ప్రపొల్షన్ మాడ్యూల్ ల్యాండర్ ను విడిచి పెడుతుంది. 


నాలుగు  లక్షల కిలోమీటర్ల ప్రయాణం


చంద్రయాన్ 3ని బాహుబలి రాకెట్‌గా చెప్పిన ఇస్రో ఆ తరవాత దానికి  Launch Vehicle Mark 3 గా పేరు పెట్టింది. దీని బరువు 642 టన్నులు. బరువు 3,921 కిలోలు. భూమి నుంచి చంద్రుడి వరకూ దాదాపు 4 లక్షల కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుంది. 24 రోజుల పాటు ఇది భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయనుంది. ఆగస్టు 23 లేదా 24 న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్‌ అవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. ల్యాండర్, రోవర్ మాడ్యూల్‌ వేరువేరుగా ఉన్న ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ చంద్రుడి సౌత్ పోల్‌ కి సమీపంలో ల్యాండ్ అవ్వనుంది. ప్రపొల్షన్ మాడ్యూల్ భూమి చుట్టూ పలుసార్లు తిరిగి చంద్రుడిపై దిగుతుంది. చంద్రుడిపై గ్రావిటీకి తగ్గట్టుగా మాడ్యూల్‌ మెల్లగా కిందకు దిగుతుంది. ల్యాండర్‌ విడిపోతుంది. లాంఛ్‌ అయినప్పటి నుంచి సరిగ్గా నెల రోజుల తరవాత చంద్రుడిపై మాడ్యూల్ దిగుతుంది.