గగన్‌యాన్‌ ప్రాజెక్టుపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2035 కల్లా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే భారతీయ స్పేస్‌ స్టేషన్‌ను అంతరిక్షంలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. మానవసహిత గగన్‌యాన్‌ ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు మహిళా ఫైటర్‌ టెస్ట్‌ పైలట్లు అవసరముందన్నారు. గగన్‌యాన్‌ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం వ్యోమగాములను నేల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపడమేనన్నారు. కక్ష్యలోకి పంపిన తర్వాత మూడు రోజుల పాటు అక్కడే ఉంచి తిరిగి భూమిపైకి తీసుకొస్తామన్నారు. వచ్చే ఏడాది మానవరహిత గగన్‌యాన్‌ వ్యోమనౌకలో మహిళా హ్యూమనాయిడ్‌ రోబోను పంపిస్తామన్న ఆయన, ఈ ప్రాజెక్టులో మహిళలను భాగం చేస్తామన్నారు.  


మహిళా ఫైటర్‌ టెస్ట్‌ పైలట్లు


మానవసహిత గగన్‌యాన్‌ ప్రాజెక్టులో మహిళా ఫైటర్‌ టెస్ట్‌ పైలట్లను కచ్చితంగా పంపుతామని, అందులో ఎలాంటి సందేహం లేదని సోమనాథ్ స్పష్టం చేశారు. అయితే అర్హులైన మహిళా అభ్యర్థులు దొరకాలని, ప్రస్తుతానికి వైమానిక దళానికి చెందిన ఫైటర్‌ టెస్టు పైలట్లను వ్యోమగాములుగా ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే మహిళా ఫైటర్‌ టెస్టు పైలట్లు మన వద్ద లేరన్న సోమనాథ్,  భవిష్యత్‌లో వారు అందుబాటులోకి వస్తే మహిళలను రోదసీలోకి పంపడానికి మార్గం సుగమం అవుతుందన్నారు. అంతరిక్షంలో మన శాస్త్రీయ పరిశోధనలు ముమ్మరమయ్యాక రెండో అవకాశం అందుబాటులోకి వస్తుందని, ఆ పరిస్థితుల్లో శాస్త్రవేత్తలే వ్యోమగాములవుతారని వెల్లడించారు. ఈ రూపంలో మహిళలకు మరిన్ని అవకాశాలు వస్తాయని సోమనాథ్‌  ఆశాభావం వ్యక్తం చేశారు. 


2025లో యాత్ర


గగన్‌యాన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములను నేల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపాలన్నది ఇస్రో లక్ష్యం. మూడు రోజుల తర్వాత వారిని భూమికి రప్పిస్తుంది. 2025లో ఈ యాత్ర జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా కొన్ని కీలక పరిజ్ఞానాలపై కొన్నేళ్లుగా కసరత్తు చేస్తోంది. ఇప్పుడు వాటిని గగనతలంలో పరీక్షించనుంది. మొదటగా టీవీ-డీ1 పరీక్షను నిర్వహించింది. ఇందులో క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ సమర్థత, క్రూ మాడ్యూల్‌ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్‌ వ్యవస్థ పటిష్ఠతను ఈ సన్నాహక పరీక్షలో పరిశీలించారు. అలాగే సాగర జలాల్లో పడే క్రూ మాడ్యూల్‌ను సేకరించి, తీరానికి చేర్చే కసరత్తునూ ఇస్రో పరీక్షిస్తుంది.


టీవీ-డీ1 పరీక్ష విజయవంతం


రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగనయాన్‌ సాకారం దిశగా తొలి అడుగు పడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన కీలక టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ వాహకనౌక పరీక్షను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి సింగిల్‌ స్టేజ్‌ లిక్విడ్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రాకెట్‌ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్‌, సురక్షితంగా పారాచూట్ల సాయంతో సముద్ర ఉపరితలంపై దిగింది. రాకెట్‌ నింగిలోకి బయల్దేరాక ఇస్రో శాస్త్రవేత్తలు అబార్ట్‌ సంకేతాన్ని పంపారు. దీంతో రాకెట్ పైభాగంలో క్రూ ఎస్కేప్‌ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు ప్రజ్వరిల్లాయి. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్‌ వ్యవస్థను రాకెట్‌ నుంచి వేరు చేశాయి. 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌, క్రూ మాడ్యూల్‌ పరస్పరం విడిపోయాయి. సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్‌ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది.