Gaganyaan: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపడుతున్న గగన్‌యాన్‌ (Gaganyaan) ప్రాజెక్టులో మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించనున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు. ఆదివారం  ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మహిళా ఫైటర్‌ టెస్టు పైలట్లు, మహిళా శాస్త్రవేత్తలను ఈ కీలక ప్రాజెక్టులో భాగం చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది మానవ రహిత గగన్‌యాన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లో మనిషిని పోలి ఉండే  ఫీమేల్‌ హ్యూమనాయిడ్‌ను పంపిస్తామన్నారు. 


వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించడం, అక్కడ మూడు రోజులపాటు వారిని ఉంచి తిరిగి తీసుకురావడం గగన్‌యాన్‌ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యమని సోమనాథ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో మహిళలను భాగం చేస్తామని  అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. భవిష్యత్తులో అది సాధ్యమయ్యేందుకు తగిన అభ్యర్థులు దొరకాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతానికి ఎయిర్‌ఫోర్స్‌కు చెందినవారిని ఫైటర్‌ టెస్టు పైలట్‌ అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. 


ఈ టెస్ట్ పైలెట్లు వివిధ కేటగిరీల నుంచి ఉన్నారని తెలిపారు. ప్రస్తుతానికి మహిళా ఫైటర్‌ టెస్టు పైలట్లు అందుబాటులో లేరని, వారు ముందుకొస్తే ఓ మార్గం సుగమం అవుతుందని సోమనాథ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గగన్‌యాన్‌లో ప్రాజెక్టులో మహిళల భాగస్వామ్యం నెలకొల్పడడం కీలమని చెప్పారు. పైలెట్ అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయ, సాంకేతిక కార్యకలాపాలతో కూడుకున్నదని తెలిపారు. ఈ ఎంపికలో శాస్త్రవేత్తలే వ్యోమగామిగా వ్యవహరించాల్సి ఉంటుందని వెల్లడించారు.


దీని ద్వారా మహిళలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని సోమనాథ్ చెప్పారు. 2035 కల్లా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే భారతీయ స్పేస్‌ స్టేషన్‌ను అంతరిక్షంలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో అంతరిక్ష రంగంలో భారత్ అద్భుతాలు సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 


తొలి టెస్ట్ వెహికల్ విజయవంతం
గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా ఇస్రో తలపెట్టిన తొలి టెస్ట్‌ వెహికల్‌ (టీవీ-డీ1) ప్రయోగం  ఆలస్యమైనా విజయవంతమైంది. ఇంజిన్‌లో గ్లిచ్ కారణంగా రెండు గంటలు ఆలస్యంగా లాంఛ్ చేశారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 10 గంటలకు గగన్‌యాన్‌ మిషన్‌ లాంఛ్ అయింది.  TV D1 Test Flight విజయవంతంగా పూర్తైందని ఇస్రో ప్రకటించింది. అనుకున్న విధంగానే క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ పని చేసింది. 


ప్రయోగం తర్వాత నింగిలో 17 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ నుంచి క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌, క్రూ మాడ్యూల్‌ పరస్పరం విడిపోగా సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్‌.. సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది. ఈ ప్రయోగంలో విజయం సాధించటం ద్వారా భవిష్యత్తులో రాకెట్ లో సమస్యలు తలెత్తినా అందులో ఆస్ట్రోనాట్లకు రక్షణ కల్పించేలా ప్రణాళికలు రచిస్తామని ఇస్రో తెలిపింది. అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. 


ఇందులో భాగంగానే గగన్‌యాన్ మిషన్ చేపట్టింది. 2025 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ అయ్యే ముందు కాసేపు టెన్షన్ పెట్టింది. టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగా ప్రయోగం రెండు గంటలు ఆలస్యమైంది. అయితే...ఇందుకు కారణమేంటో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వివరించారు. లిఫ్ట్ ఆఫ్ అయ్యే ముందు చిన్న సమస్య ఎదురైందని, అందుకే...ప్రయోగంలో జాప్యం జరిగిందని చెప్పారు.