Gujarat Garba Dance: 



గుండెపోటుతో మృతి..


గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల్లో గార్బా నృత్యం చేస్తూ గత 24 గంటల్లో 10 మంది చనిపోయారు. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. మృతుల్లో యువకుల నుంచి మధ్య వయస్కుల వరకూ ఉన్నారు. దభోయ్ ప్రాంతానికి చెందిన ఓ 13 ఏళ్ల బాలుడు డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. అహ్మదాబాద్‌కి చెందిన 24 ఏళ్ల యువకుడు డ్యాన్స్ చేస్తూ సడెన్‌గా కింద పడిపోయాడు. గుండెపోటుతో చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. కపడ్‌వంజ్‌లో 17 ఏళ్ల బాలుడు గార్బా చేస్తుండగా హార్ట్‌అటాక్ వచ్చింది. గుజరాత్‌లో చాలా చోట్ల ఈ ఘటనలు నమోదయ్యాయి. నవరాత్రి వేడుకలు జరుగుతున్న ప్రతిచోటా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచింది. ఈ సర్వీస్‌లకు వందలాది కాల్స్‌ వచ్చాయి. వీటిలో 521 కాల్స్‌ గుండెపోటుకి సంబంధించినవే కాగా..609 మంది శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతూ మూర్ఛపోయారు. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్యలోనే ఎక్కువా కాల్స్‌ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్నీ అప్రమత్తం చేసింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌నీ అలెర్ట్ చేసింది. గార్బా వేడుకలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించింది. గార్బా ఆర్గనైజర్లకూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కచ్చితంగా ఆంబులెన్స్‌లకు కారిడార్‌లు ఏర్పాటు చేయాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు చాలా చోట్ల ఆంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. కొంత మంది వైద్యులనూ అందుబాటులో ఉంచారు. నిర్వాహకులకు CPR ట్రైనింగ్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. 


ఇదీ ప్రత్యేకత..


వలయాకారంలో సాగే నృత్యం ఇది. ఎక్కువ మంది పాల్గొంటున్నపుడు ఎక్కువ సంఖ్యలో వలయాలు ఏర్పాటు చేస్తారు. ఈ నృత్యానికి ఒక ప్రత్యేకమైన దృక్పథం ఉంటుంది. కాలచక్రం ఎప్పుడూ తిరుగుతూ పునరావృతం అవుతుంది. పుట్టుక నుంచి మరణం వరకు, మరణం నుంచి పునర్జన్మ వరకు ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఈ అన్నీ అంశాల్లోనూ కదలకుండా నిరంతరాయంగా ఉండేది దైవశక్తి ఒకటే. దానికి ప్రతీకగా నృత్య వలయం మధ్య దేవీ ప్రతిమ లేదా పెద్ద దీపపు సెమ్మెను పెడతారు. దాని చుట్టూనే జీవితం తిరుగుతుందని చెప్పేందుకు ఇదొక ప్రతీక. శక్తి రూపంలో ఉండే దైవం నిరంతరమైనదని చెబుతుంది. గుజరాత్ లో ఈ తొమ్మిది రాత్రులలోనూ దుర్గాదేవిని ప్రసన్నం చేసుకునేందుకు స్త్రీలు, పరుషులు రాత్రి పొద్దుపోయే వరకు నృత్యాలు చేస్తారు. చాలా మంది ఈ తొమ్మిది రోజుల పాటు కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు, ఉపవాసాలు కూడా పాటిస్తారు. గుజరాత్‌లో నవరాత్రి ఉత్పవాల్లో గార్బా ప్రధానమైంది. గార్బా ఉత్సవానికి ఒక ప్రత్యేకమైన ఉత్సాహాన్ని తెస్తుంది.గ్రామాల్లో జరిగే అన్ని జానపద సంప్రదాయల మాదిరిగానే దీనికి కూడా ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ నృత్యాన్ని దేవీ ఆరాధనలో భాగంగా చెప్పుకోవచ్చు. గార్బా నృత్యాలు నవరాత్రి సమయంలో ప్రదర్శిస్తారు. నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు. ఇవి దుర్గామాత ను కొలుచుకునే రోజులు. హిందుత్వంలో స్త్రీ శక్తికి జరిపే ఆరాధనగా దీన్ని చెప్పుకోవచ్చు.