Israel Palestine War: 


ఇజ్రాయేల్ యుద్ధంపై మోహన్ భగవత్..


ఇజ్రాయేల్ హమాస్ యుద్ధంపై RSS చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. భారత్‌లో ఎప్పుడూ ఇలాంటి అంతర్గత యుద్ధాలు జరిగే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. హిందూమతం అన్ని వర్గాల వాళ్లను ఆదరిస్తుందని స్పష్టం చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 350వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఓ కార్యక్రమానికి హాజరయ్యారు మోహన్ భగవత్. ఈ సందర్భంగా ఇజ్రాయేల్ పాలస్తీనా యుద్ధం గురించి ప్రస్తావించారు. ఆ అంశాన్ని హిందూమతంతో ముడిపెడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూయిజం అన్ని వర్గాల విశ్వాసాలకు గౌరవిస్తుందని అన్నారు. అంతర్గత కొట్లాటలు లేవని, అందుకే మనం హిందువులం అని గర్వంగా చెప్పుకోవాలని సూచించారు. 


"ఈ భారత దేశంలో అన్ని మతాలను, వర్గాలను గౌరవించే మతం ఏదైనా ఉందంటే అది హిందూమతం మాత్రమే. ఇది హిందూ దేశం. అలా అని మిగతా మతాలను ద్వేషించాలని కాదు. ముస్లింలకు రక్షణ కల్పించాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందువులు మాత్రమే ఇది చేయగలరు. భారత్‌లో మాత్రమే ఇది సాధ్యం. మరే దేశంలోనూ ఇంత భద్రత కనిపించదు. చాలా దేశాల్లో అంతర్గత కలహాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం జరుగుతోంది. మన దేశంలో మాత్రం ఇలాంటి యుద్ధాలు ఎప్పుడూ జరగలేదు. శివాజీ మహారాజ్‌ పరిపాలనా సమయంలో ఇలాంటి ఆక్రమణలు జరిగాయి. కానీ ఇలా రెండు మతాల మధ్య యుద్ధాలు జరగలేదు. అందుకే మనం హిందువులం అని గర్వంగా చెప్పుకోవాలి"


- మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ 


రిజర్వేషన్‌లపై RSS చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా మన సమాజంలో అసమానతలు ఉన్నాయని, ఇవి ఉన్నంత కాలం రిజర్వేషన్‌లు ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన...అఖండ భారతం గురించి ప్రస్తుత తరం కచ్చితంగా ఆలోచిస్తుందని వెల్లడించారు. 1947లో భారత్ నుంచి విడిపోయిన వాళ్లు ఇప్పుడు ఆలోచనలో పడ్డారని..తప్పు చేశామని తెలుసుకున్నారని పరోక్షంగా పాకిస్థాన్‌ గురించి ప్రస్తావించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం మరాఠీ రిజర్వేషన్‌లపై ఆందోళనలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేయడం కీలకంగా మారింది. 


"మనంతట మనమే కొందరిని వేరు చేసి సమాజం నుంచి వెనక్కి నెట్టేశాం. దూరం పెట్టాం. వాళ్లను కనీసం పట్టించుకోలేదు. దాదాపు 2వేల ఏళ్ల పాటు ఇదే జరిగింది. వాళ్లకు సమాన హక్కులు ఇవ్వనంత వరకూ ఇలాంటి ప్రత్యేక హక్కులు ఇవ్వాల్సి ఉంటుంది. రిజర్వేషన్‌లు అలాంటి వాటిలో ఒకటి. సమాజంలో వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్‌లు ఉండాల్సిందే. రాజ్యాంగ పరంగా ఇచ్చిన రిజర్వేషన్‌లకు RSS ఎప్పుడూ మద్దతుగా ఉంటుంది. మనకు కనిపించకపోయినా వివక్ష అనేది మన సమాజంలో ఇప్పటికీ ఉంది. ఇలాంటి వాళ్లకు రిజర్వేషన్‌ల ద్వారానే గౌరవమివ్వాలి."


- మోహన్ భగవత్, RSS చీఫ్ 


Also Read: గాజాకి భారత్ భారీ సాయం, స్పెషల్ ఫ్లైట్‌లో టన్నుల కొద్ది మెడిసిన్స్‌