Chennai Airport Flight Situation | చెన్నై విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించగా వాతావరణం అనుకూలించలేదు. మరోవైపు విమానం ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో పొగలు సైతం వచ్చినట్లు తెలుస్తోంది. ఇండింగో విమానం ల్యాండింగ్ ను పైలట్ చివరి నిమిషంలో ఆపేశారు. సరిగ్గా ల్యాండ్ అయ్యే సమయంలోనే విమానం ఒక్కసారిగా మళ్లీ గాల్లోకి లేవడంతో ఊహించని ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ విమానం హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లింది. చెన్నై ఎయిర్ పోర్టులో పరిస్థితులు అనుకూలించకపోవడంతో అధికారులు విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. అనంతరం కొంత సమయానికి బెంగళూరు విమానాశ్రయంలో ఆ ఇండిగో విమానం సేఫ్ ల్యాండింగ్ అయినట్లు తెలుస్తోంది.
తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, విమానాల రాకపోకలకు ఇబ్బందులు
ఫెంగల్ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా చెన్నై ఎయిర్ పోర్టును శనివారం మూసివేయడం తెలిసందే. నీళ్లు తోడిన అనంతరం ఎయిర్ పోర్టును సిబ్బంది ప్రయాణాలకు సిద్ధం చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ మూసివేయడానికి ముందు హైదరాబాద్ నుంచి వెళ్లిన విమానం ల్యాండింగ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ఏదో సమస్య తలెత్తింది. దాంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం గాల్లో ఏకంగా ఒకవైపునకు ఒరిగినా సెట్ అయింది. భారీ వర్షాలు ,ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానాలు రద్దు చేయడంతో పాటు చెన్నై ఎయిర్ పోర్టును సైతం క్లోజ్ చేశారు.