Top 10 Fastest Growing Cities In World | న్యూఢిల్లీ: ఆసియా దేశాలు ఇతర ఖండాలతో పోటీ పడి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. 2033 నాటికి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 15 నగరాలలో హైదరాబాద్ సహా ఏకంగా 5 భారతీయ నగరాలు చోటు దక్కించుకున్నాయి. అది భారతదేశం వృద్ధి చెందుతున్న తీరును తెలుపుతుంది. ఆసియాలోని నగరాలు ఇంకా చెప్పాలంటే భారతదేశం మరో దశాబ్దం తరువాత ప్రపంచ దేశాలకు సవాల్ విసిరే స్థానంలో నిలవనుంది.
టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు
సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ ప్రకారం 2033 నాటికి ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నగరాలలో 5 భారత నగరాలు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే వంటి నగరాలు గ్లోబల్ అర్బన్ డెవలప్‌మెంట్‌లో టాప్ 10లో నిలిచాయి. ఆ జాబితాలో బెంగళూరు ఏకంగా అగ్రస్థానం దక్కించుకోగా, దేశ రాజధాని ఢిల్లీ మూడు, హైదరాబాద్ నాలుగు, ముంబై ఐదవ స్థానాల్లో నిలిచాయి. వియత్నాలోని హో చి మిన్హ్ 2వ, చైనాలోని షెంజెన్, గాంగ్జౌ, సుజోలు వరుసగా 6, 7, 8 స్థానాల్లో ఉన్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్ 9, ఫిలీప్పీన్స్ రాజధాని మనీలా 10వ స్థానం దక్కించుకున్నాయి. జనాభా, తలసరి ఆదాయం, ఆర్థిక వృద్ధి, జీడీపీ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే చేపట్టారు.
ర్యాంక్ | నగరం | దేశం | రీజియన్ |
1 | బెంగళూరు | భారత్ | దక్షిణాసియా |
2 | హో చి మిన్హ్ | వియత్నాం | సౌత్ ఈస్ట్ ఏసియా |
3 | ఢిల్లీ | భారత్ | దక్షిణాసియా |
4 | హైదరాబాద్ | భారత్ | దక్షిణాసియా |
5 | ముంబై | భారత్ | దక్షిణాసియా |
6 | షెంజెన్ | చైనా | తూర్పు ఆసియా |
7 | గాంగ్జౌ | చైనా | తూర్పు ఆసియా |
8 | సుజో | చైనా | తూర్పు ఆసియా |
9 | రియాద్ | సౌదీ అరేబియా | మిడిల్ ఈస్ట్ |
10 | మనీలా | ఫిలీప్పిన్స్ | సౌత్ ఈస్ట్ ఏసియా |
అత్యధిక జనాభా ఉన్న నగరంగా ఢిల్లీ!
టాప్ 15 స్థానాలలో 14 ఆసియాకు చెందిన నగరాలు ఉన్నాయి. మొత్తం 230 నగరాలపై జనాభా, వ్యక్తిగత వృద్ధి, జీడీపీలో పెరుగుదల, స్థిరమైన అభివృద్ధి లాంటి అంశాలు పరిగణనలోకి తీసుకుని సావిల్స్ గ్రోత్ ఇండియా సర్వే చేసింది. 2033 నాటికి భారత్ లోని నగరాలు 68 శాతం జీడీపీ వృద్ధిరేటును సాధించనున్నాయి. 2050 నాటికి దాదాపు 2.5 బిలియన్ల మంది (250 కోట్ల మంది) ప్రజలు నగరాల్లో నివసించనున్నారు. అదే సమయంలో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా మారనుంది.
సాంకేతికతపై దృష్టి సారించడంతో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. దాని వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు షిఫ్ట్ అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరగనున్న ఈ వృద్ధిలో దాదాపు 90 శాతం ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనే కనిపించనుంది. భారత ఆర్థిక రాజధాని ముంబై ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు బెంగళూరు, హైదరాబాద్, పూణేలు టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, అధునాతన తయారీ రంగాలలో వేగంగా వృద్ధిని సాధిస్తాయని సర్వేలో అంచనా వేశారు. భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం, సరళీకృత పన్ను విధానం ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుంది. దేశ జనాభాలో 35 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కానీ గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు వలసలు భారీగా పెరుగుతున్నాయి.
Also Read: HYDRA Demolitions: హైడ్రా మిగిల్చిన ఆర్థిక నష్టాల బాధ్యత ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ