Indri Whiskey: ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీ ఏదో తెలుసా? పోనీ ఏ దేశానిదో అంచనా వేయగలరా? ఏ ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, మాల్డోవా లాంటి దేశాలకు చెందిన విస్కీ అయి ఉంటుందని అనుకుంటారు చాలా మంది. ఈ దేశాలు మద్యానికి చాలా ఫేమస్ కాబట్టి అలా అనుకోవడం సహజం. కానీ, ఆ దేశాలకు చెందిన విస్కీలేవీ ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీగా నిలవలేకపోయాయి. మరీ ఏ దేశ విస్కీ అత్యుత్తమంగా నిలిచిందో తెలుసా? ప్రపంచంలోనే ది బెస్ట్ విస్కీగా భారత్ లో తయారైన విస్కీ నిలిచింది. ఇంద్రి బ్రాండ్ విస్కీని.. ది బెస్ట్ విస్కీగా ఎంపిక చేసింది విస్కీస్ ఆఫ్ ది వరల్డ్. ఇంద్రి దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ 2023 ప్రపంచంలోని అతిపెద్ద విస్కీ- టేస్టింగ్ పోటీల్లో ఒకటైన డబుల్ గోల్డ్ బెస్ట్ ఇన్ షో అవార్డును అందుకుంది. 


ప్రతి ఏటా ఈ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100కు పైగా విస్కీ బ్రాండ్ లు పోటీపడతాయి. అలాంటి ఈ ప్రతిష్టాత్మక అవార్డును భారతదేశానికి చెందిన ఇంద్రి దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ 2023 దక్కించుకోవడం విశేషం.


భారత్ లో తయారైన ఇంద్రి దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ 2023.. ఈ ఏడాదికి గానూ విస్కీస్ ఆఫ్ ది అవార్డ్స్ లో బెస్ట్ ఇన్ షో, డబుల్ గోల్డ్ టైటిల్ ను గెలుచుకుంది. ఇంద్రి సింగిల్ మాల్ట్ విస్కీ ఈ ప్రతిష్టాత్మక టైటిల్ ను గెలుచుకుంది. భారతీయ పీటెడ్ క్లాస్ విస్కీ, అమెరికన్ సింగిల్ మాల్ట్ విస్కీలు, స్కాచ్ విస్కీలు, బోర్బన్స్, కెనడియన్ విస్కీలు, ఆస్ట్రేలియన్ సింగిల్ మాల్ట్ లు, బ్రిటీష్ సింగిల్ మాల్ట్ లతో సహా వందలాది అంతర్జాతీయ బ్రాండ్ లను ఓడించింది. 2021లోనే ఈ బ్రాండ్ ప్రారంభమైంది. 


హర్యానాలోని పికాడల్లీ డిస్టిలరీస్ నుంచి వచ్చిన స్వదేశీ బ్రాండ్. ఇది ట్రిపుల్- బ్యారెల్ సింగిల్ మాల్ట్ విస్కీ. గత రెండు సంవత్సరాల్లో 14 కంటే ఎక్కువ అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది ఇంద్రి విస్కీ. టోక్యో విస్కీ, స్పిరిట్స్ కాంపిటీషన్ 2023, ఫిఫ్టీ బెస్ట్ వరల్డ్ విస్కీస్ 2022 అవార్డు, లాస్ వెగాస్ లో జరిగిన ఇంటర్నేషనల్ విస్కీ పోటీలోనూ ఇంద్రి విస్కీ గెలిచింది. విస్కీ అడ్వొకేట్ టాప్ 20 విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ లిస్ట్ లో ఫీచర్ అయింది. ఇప్పుడు ప్రపంచంలోన్ అత్యుత్తమంగా భావించే బెస్ట్ ఇన్ షో, డబుల్ గోల్డ్ అవార్డును సొంతం చేసుకుంది. 


ఇంద్రి విస్కీ దేశంలోని 19 రాష్ట్రాల్లో, 17 ఇతర దేశాల్లో అందుబాటులో ఉంది. నవంబర్ నుంచి అమెరికా సహా.. కొన్ని యూరోపియన్ దేశాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. వాసన, రుచి, స్పర్శ, దృష్టి, ధ్వని వంటి ఐదు ఇంద్రియాల మీదుగా ఈ విస్కీకి ఇంద్రి అనే పేరు పెట్టారు.