Bomb Threat: కొచ్చి నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానానికి ఇవాళ(ఆగస్టు 28) ఉదయం వేళ బాంబు బెదిరింపులు వచ్చాయి. కొచ్చి విమానాశ్రయం నుంచి బెంగళూరు బయలుదేరేందుకు సిద్ధం అవుతున్న సమయంలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. విమానంలో కూర్చున్న ఒక శిశువు సహా 139 మంది ప్రయాణికులను హుటాహుటినా కిందకు దించేశారు. విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించిన అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. 


కొచ్చి నుంచి బెంగళూరుకు బయలుదేరేందుకు సిద్ధం అవుతున్న సమయంలో ఉదయం 10.30 గంటలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. వెంటనే 6E6482 ఇండిగో ఫ్లైట్ లోకి ఆన్ బోర్డు అయిన 139 మందిని వెంటనే డీబోర్డు చేశారు. ఐసోలేషన్ బేలో విమానాన్ని ఉంచి క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. బాంబు స్క్వాడ్, రాష్ట్ర పోలీసులు, భద్రతా విభాగం బృందం తనిఖీలు చేపట్టారు. విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు వారికి కనిపించలేదు. దీంతో ప్రయాణికులు లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాటిలోనూ అనుమానాస్పదంగా ఏదీ కనిపించకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చున్నారు. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని పోలీసులు తేల్చారు. 


నెడుంబస్సేరి పోలీసులు ఈ బాంబు బెదిరింపు కాల్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అనే వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈ ఫేక్ కాల్ వల్ల కొచ్చి నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన విమానం 3 గంటలకు పైగా ఆలస్యం అయింది. చివరికి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విమానం కొచ్చి నుంచి బయల్దేరిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.


 Also Read: UP Teacher: 'నేను తప్పు చేశాను, కానీ అందులో మతపరమైన విద్వేషమేమీ లేదు'


ఆగస్టు 18వ తేదీన ఢిల్లీ- పుణె విస్తారా ఎయిర్ లైన్స్ విమానానికి ఇలాగే బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీని వల్ల ఢిల్లీ విమానాశ్రయం నుంచి విస్తారా విమానం బయలుదేరే సరికి 8 గంటలపాటు ఆలస్యమైంది.