Chandrayaan 3 Rover Pragyan Faces Large Crater During Moon Walk:


చంద్రుడిపై సౌత్ పోల్ పై దిగిన మన చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్ లో నుంచి బయటకు వచ్చి శాస్త్రీయమైన పరిశోధనలు చేస్తున్న రోవర్ ప్రజ్ఞాన్ కు పెను ప్రమాదమే తప్పింది. అదేంటంటే పరిశోధనల కోసం విక్రమ్ ల్యాండర్ ర్యాంప్ నుంచి బయటకు వచ్చి తిరుగుతున్న రోవర్ ప్రజ్ఞాన్ ఓ పెద్ద గోతి దగ్గరకు వెళ్లి ఆగిపోయింది. ల్యాండర్ దిగిన ప్రదేశం నుంచి కొంచెం దూరంలోనే ఉన్న ఈ నాలుగు మీటర్ల క్రేటర్ ను వెంటనే గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్ దానికి మూడుమీటర్ల దూరంలో నిలిచిపోయింది. 


రోవర్ కు వచ్చిన ఈ తొలి అడ్డంకిని గమనించిన ఇస్రో శాస్త్రవేత్తలు వెళ్లిన దారినే వెనక్కి వచ్చేయాల్సిందేగా రోవర్ కు కమాండ్ ఇచ్చారు. ఫలితంగా రోవర్ ప్రజ్ఞాన్ వెళ్లిన దారిలోనే వెనక్కి వచ్చేసింది. మరో కొత్త దారిలో వెళ్లి ప్రయోగాలు చేసేందుకు ప్రజ్ఞాన్ రోవర్ సిద్ధమైంది. సరైన సమయానికి రోవర్ ఆ గోతిని గుర్తించింది కాబట్టి సరిపోయింది లేదంటే ఊహించని ప్రమాదమే జరిగి ఉండేదని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ ఇలాంటి అవరోధాలను ఈజీగా గుర్తించగల సామర్థ్యంతో ప్రజ్ఞాన్ రోవర్ తయారవటం ఇక్కడ గమనించాల్సిన అంశం.


జాబిల్లి అంత కూల్ కాదు.. ఉష్ణోగ్రతల వివరాలివే.. 
 చంద్రయాన్ 3 మిషన్‌పై ఇస్రో మరో ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన వివరాలు తెలిపింది. ఇక్కడి విక్రమ్ ల్యాండర్‌కి అనుసంధానించిన Chandra’s Surface Thermophysical Experiment (ChaSTE) పేలోడ్ అక్కడి ఉష్ణోగ్రతలను రికార్డ్ చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలు తెలిపింది. ఈ సమాచారం ద్వారా అక్కడి థర్మల్ బిహేవియర్‌ని అర్థం చేసుకోవడం శాస్త్రవేత్తలకు సులభతరం కానుంది. ఇదే విషయాన్ని ఇస్రో అధికారికంగా ట్వీట్ చేసింది. ChaSTE పే లోడ్‌ కంట్రోల్డ్ పెనట్రేషన్ మెకానిజంతో పని చేస్తుంది.


చంద్రుడి ఉపరితలంపై దాదాపు 10 సెంటీమీటర్ల లోతు వరకూ వెళ్లగలిగే కెపాసిటీ ఉంటుంది. దీనికి దాదాపు 10 టెంపరేచర్ సెన్సార్లు అనుసంధానించారు. ఈ సెన్సార్లే అక్కడి ఉష్ణోగ్రతల వివరాలను అందిస్తాయి. ఉపరితలంపై ఒక్కో చోట ఒక్కో విధమైన ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఇస్రో ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఓ మ్యాప్‌ని కూడా షేర్ చేసింది. లూనార్ సౌత్‌ పోల్ నుంచి ఇలాంటి ప్రొఫైల్ రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతానికి అందిన సమాచారాన్ని వెల్లడించిన ఇస్రో...పూర్తి వివరాలను త్వరలోనే చెబుతామని తెలిపింది. 


చంద్రయాన్-3 సక్సెస్ క్రెడిట్ ఎవరిది- మోదీ దా! నెహ్రూ దా?
 ABP న్యూస్, CVoterతో కలిసి చంద్రయాన్ 3 విజయం క్రెడిట్ ఎవరికి దక్కాలని వారు భావిస్తున్నారనే అంశంపై ప్రజల మనోభావాలను తెలుసుకోవడానికి ఒక స్నాప్ పోల్ నిర్వహించింది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) మద్దతుదారుల్లో ఎక్కువ మంది ప్రధాని మోదీకి అనుకూలంగా చెప్పారు. 35.5% మంది ప్రధాన మంత్రి మోదీకే చంద్రయాన్ సక్సెస్ క్రెడిట్ దక్కుతుందన్నారు. 5.4% మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీ లేదా జవహర్ లాల్ నెహ్రూకు దక్కుతుందని అభిప్రాయపడ్డారు. 3.9% మంది ఇరు పార్టీలకు క్రెడిట్ ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఎక్కువగా 53.9% మంది శాస్త్రవేత్తలకు చంద్రయాన్ 3 క్రెడిట్ ఇచ్చారు. వారు మాత్రమే ప్రశంసలకు అర్హులని పేర్కొన్నారు.