నేడు (ఫిబ్రవరి 1) దేశమంతా కేంద్ర బడ్జెట్ 2022-23 పై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇందుకు ఒకరోజు ముందే అంటే బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఆర్థిక సర్వే 2021-22ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సర్వే దేశ ఆర్థిక పరిస్థితిని సవివరంగా పేర్కొంది. దేశ ఆర్థిక వృద్ధి మరింత పెరగడానికి ఏ సంస్కరణలు అవసరమో కూడా ఆర్థిక సర్వే సూచించింది. అయితే, ఈ ఆర్థిక సర్వే 2021-22లో ఆసక్తికర విషయం ఒకటి గమనించాల్సి ఉంది. ఇందులో శాటిలైట్, జియోస్పేషియల్ డేటా సహా కొన్ని ఉపగ్రహ చిత్రాలను పొందుపరిచారు. వీటిలో 2012లో 2021లో భారత్ రాత్రి వేళ అంతరిక్షం నుంచి ఎలా కనిపిస్తుందనే ఫోటోలను సర్వేలో ఉంచారు. ఈ పదేళ్లలో విద్యుత్ వినియోగంలో ఎంతో మార్పు కలిగినట్లుగా ఆ ఫోటోలను చూస్తే అర్థం అవుతోంది.
రాత్రి వేళ వెలిగిపోతున్న భారత దేశ ఉపగ్రహ చిత్రాలను ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. దేశమంతా 2012కి ఇప్పటికీ విద్యుత్ సరఫరా, వినియోగం ఏ స్థాయిలో పెరిగిందనే విషయాన్ని ఈ శాటిలైట్ ఫోటోలు చెబుతున్నాయని దేశ ముఖ్య ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ తెలిపారు. ఈ మేరకు ఆయన సంబంధిత ఫోటోలను ట్వీట్ చేశారు. ‘‘ఆర్థిక సర్వే 2022: దేశం కాంతులీనుతున్న ఉపగ్రహ చిత్రాలు పదేళ్ల క్రితం ఇప్పటి ఫోటోలు చూడండి. దేశంలో విద్యుత్ వినియోగం, సరఫరా, పట్టణీకరణ ఏ స్థాయిలో పెరిగిందో అర్థమవుతుంది’’ అని ట్వీట్ చేశారు.
అంతేకాకుండా, దేశంలో జాతీయ రహదారులు పెరిగిన తీరును కూడా ఆర్థిక సర్వేలో కళ్లకు కట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సంజీవ్ సన్యాల్ ట్వీట్ చేశారు. 2011లో ఉన్న జాతీయ రహదారులు కాకుండా 2021నాటికి భారీ సంఖ్యలో నిర్మించినట్లుగా ఆ చిత్రాలను బట్టి అర్థం అవుతోంది.
విమానాశ్రయాలు రెట్టింపు
అలాగే కార్యకలాపాలు సాగిస్తున్న విమానాశ్రయాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 2016లో కేవలం 62 ఆపరేషనల్ ఎయిర్ పోర్టులు ఉండగా.. వాటి సంఖ్య 2021 నాటికి 130 కి చేరింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్ స్కీమ్‌కు ముందు ఇప్పుడు ఎయిర్ పోర్టుల సంఖ్య రెట్టింపు అయిందని ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు.