Emergency Alert: దేశంలో మంగళవారం చాలా మొబైళ్లకు మరో సారి ఎమెర్జెన్సీ వార్నింగ్ అలెర్ట్ మెస్సేజ్ వచ్చింది. మొబైల్ వినియోగదారులకు ప్రభుత్వం ఎమర్జెన్సీ వార్నింగ్ పంపింది. ఆండ్రాయిడ్, ఐఫోన్ తేడా లేకుండా ఎమర్జెన్సీ టోన్‌తో అలర్ట్ ఫ్లాష్ మెసేజ్ 11:35కి మోగింది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) అభివృద్ధి చేస్తున్న అత్యవసర హెచ్చరిక వ్యవస్థ పరీక్షించే క్రమంలో ఈ వార్నింగ్ అలెర్ట్ పంపినట్లు తెలిసింది.


భారతదేశం అంతటా స్మార్ట్‌ఫోన్‌లకు ఎమర్జెన్సీ అలర్ట్‌లు వెళ్లాయి. ఆ సమయంలో ఫోన్లు పెద్ద శబ్ధం చేస్తూ అత్యవసర హెచ్చరిక అంటూ ఫ్లాస్ మెస్సేజ్ కనిపించింది. ఒకసారి ఇంగ్లిషులో మరోసారి హిందీలో కొన్ని నిమిషాల తేడాతో రెండు వార్నింగ్ అలెర్ట్‌లు వచ్చాయి. సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ (CBS) ద్వారా 11:30 PM మరియు 11:44 PM అలెర్ట్‌ పంపినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) తెలిపింది. అభివృద్ది చేస్తున్న సాంకేతిక వ్యవస్థలో లోపాలు, సమస్యలను గుర్తించడానికి సందేశం పంపినట్లు తెలియజేసింది.


"ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అభివృద్ధి చేసిన పాన్-ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షించడానికి పంపబడింది. ఇది ప్రజల భద్రతను మెరుగుపరచడం, అత్యవసర సమయాల్లో హెచ్చరికలను పంపడమే దీని లక్ష్యం. టైమ్‌స్టాంప్: 10-10-2023 11:30 AM 11’ అని ఫ్లాష్ మెస్సేజ్ వచ్చింది. 


CBS అనేది ఫోన్ ఆన్‌లో ఉన్న మొబైల్ నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా నిర్దిష్ట ప్రాంతంలోని అన్ని ఫోన్‌లకు టెక్స్ట్ సందేశాలను పంపడానికి మొబైల్ ఆపరేటర్‌లను అనుమతించే సాంకేతికత. ఇది అత్యవసర హెచ్చరికలను పంపడానికి అభివృద్ధి చేస్తున్నారు. అలర్ట్ సిస్టమ్ సక్రమంగా పనిచేస్తుందా? లేదా? నిజమైన ఎమర్జెన్సీ సమయంలో ప్రజలను చేరుకోవడానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి NDMA ఈ పరీక్షలను నిర్వహిస్తోంది.  


గత నెల సెప్టెంబర్ 15న చాలా మంది వినియోగదారులకు ఇలాంటి ఫ్లాష్ వార్నింగ్ అలెర్ట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ పంపించింది. ఈ ఫ్లాష్‌ మెసేజ్‌ చూసి వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. జులై, ఆగష్టు నెలల్లో మాదిరిగానే ఇప్పుడు కూడా చాలా మంది యూజర్లకు ఫ్లాష్ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ వచ్చిన వెంటనే పెద్దగా బీప్ శబ్దం వినిపించింది. ఈ అలర్ట్ ను చూసి చాలా మంది వినియోగదారులు కంగారు పట్టారు. అయితే, ఈ మెసేజ్ తో భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 


గతంలో C-DOT CEO రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ దీనిపై స్పందించారు. సెల్ బ్రాడ్‌కాస్ట్ కోసం సాంకేతికత ప్రస్తుతం విదేశాల్లో అందుబాటులో ఉందని, దీనిని C-DOT దాని స్వంతంగా అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఈ సాంకేతికత ఇంకా అభివృద్ధి దశలో ఉందని ఉందని, విపత్తుల సమయంలో మొబైల్ ఫోన్ స్క్రీన్‌లకు నేరుగా హెచ్చరికలను పంపడానికి NDMA దీన్ని ఉపయోగిస్తుందని ఆయన చెప్పారు. ఇది ప్రస్తుతం దేశంలో Jio, BSNL నెట్‌వర్క్‌లలో పరీక్షిస్తున్నట్లు తెలిపారు.