కేంద్ర ప్రభుత్వం ఒరిజినల్ కంటెంట్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకు. సోషల్ మీడియా సంస్థలు, గూగుల్, మెటా లాంటి సంస్థలు ఏ న్యూస్ పేపర్, డిజిటల్ మీడియా, ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ నుంచి కంటెంట్ తీసుకుంటున్నాయో వాటికి కొంత మొత్తం నగదు చెల్లించాలని కేంద్రం భావిస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే.. గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మైక్రోసాఫ్ట్, యాపిల్, మైక్రో బ్లాగింగ్ ట్విట్టర్, అమెజాన్ సంస్థలు తాము వాడుకునే కంటెంట్‌కుగానూ ఆయా మీడియా సంస్థలు సహా ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్‌కు నగదు చెల్లించాల్సి ఉంటుంది.


విదేశాలలో ఇదివరకే అమలులో..
వాడుకున్న కంటెంట్‌కు ఆయా సంస్థలు.. ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్‌కు, సంబంధిత మీడియా ఆర్గనైజేషన్‌కు నగదు చెల్లించడం అనేది కొత్త విషయం కాదు. యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా దేశాలలో ఈ విధానం ఇదివరకే అమలులో ఉంది. ఐటీ చట్టాలు సవరణలో భాగంగా వీటిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ విషయాన్ని తెలిపారు. కేంద్రం చట్టాల సవరణలో భాగంగా ఈ విధానాన్ని అమలు చేస్తే మీడియా సంస్థలకు, ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్‌కు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. 


డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు కొత్త నియమాలు..
ఇప్పటివరకూ ఉన్ రూల్స్ ప్రకారం సోషల్ మీడియా సంస్థలు న్యూస్ మీడియా నుంచి, కంటెంట్ క్రియేటర్స్ నుంచి ఒరిజినల్ కంటెంట్ తీసుకుని ప్రయోజనం పొందుతున్నాయి. తాజాగా సవరించనున్న ఐటీ రూల్స్ ద్వారా మీడియా సహా సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసే సంస్థలకు బెనిఫిట్ కలుగుతుంది. ఎవరైనా ఆయా మీడియా (పేపర్, డిజిటల్ న్యూస్ మీడియా) నుంచి, కంటెంట్ క్రియేటర్స్ పేజీలు, సైట్‌ల నుంచి సమాచారం తీసుకుని తమ ప్రయోజనాలకు వాడుకుంటే కచ్చితంగా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఏదైనా ఇండిపెండెంట్ న్యూస్ ఏజెన్సీ, పబ్లిషింగ్ న్యూస్ సంస్థ, కంటెంట్ క్రియేటర్స్ ప్రచురించిన.. పబ్లిష్ చేసిన సమాచారాన్ని ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా సంస్థలు వినియోగిస్తే అందుకుగానూ వారికి కొంత మేర చెల్లించేలా చట్టాలలో మార్పులు తీసుకువస్తామన్నారు. గత కొన్ని నెలల నుంచి కేంద్రం దీనిపై యోచిస్తోందని చెప్పారు.


డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (DNPA), ఇండియన్ న్యూస్ సొసైటీ (INS)లు కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (CCI)కు గూగుల్, మరికొన్ని సంస్థలపై ఒరిజినల్ కంటెంట్ వినియోగంపై ఫిర్యాదు చేశాయి. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్పెయిన్ లాంటి దేశాలు న్యూస్ మీడియాలకు వారి కంటెంట్‌ను సోషల్ సంస్థలు వాడితే నగదు చెల్లించేలా చట్టాలు తీసుకొచ్చాయని సీసీఐకి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ విషయాన్ని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం మీడియా సంస్థలకు నష్టం జరుగుతోందని, వారి కంటెంట్‌ను సోషల్ మీడియా లాంటి సంస్థలు వినియోగించుకుని ప్రయోజనం పొందుతున్నాయని గుర్తించారు. కనుక న్యూస్ పేపర్, డిజిటల్ న్యూస్ మీడియాలకు ప్రయోజనం చేకూర్చేలా వారి కంటెంట్ వినియోగిస్తే అందుకు నగదు పొందవచ్చునని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలోనే కేంద్రం అధికారిక ప్రకటన చేయనుంది.