Siddaramaiah: కర్ణాటకలోని అల్లర్ల సెగ సిద్ధరామయ్యకు తగిలింది. అల్లర్లలో గాయపడిన వారిని పరామర్శించి తిరిగి వెళ్తుండగా ఓ మహిళ నుండి తీవ్ర నిరసన సిద్ధరామయ్యకు ఎదురైంది. 2 లక్షల రూపాయల డబ్బును ఆయనపైకి విసిరేసింది. అసలేం జరిగిందంటే... కర్ణాటకలోని కెరూర్ పట్టణంలో జులై 7న అల్లర్లు జరిగాయి. ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు ఘర్షణకు దిగారు. దొరికిన వస్తువులతో కొట్టుకున్నారు. కొందరు వ్యక్తులు కత్తులు తీసుకొచ్చారు. మరికొందరు రాడ్లతో దొరికిన వారిని దొరికినట్లు ఇష్టారీతిగా కొట్టారు. ఇరు వర్గాల వారి దాడులతో ఆ ప్రాంత అంతా రణరంగాన్ని తలపించింది. ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతూ బీభత్సం సృష్టించారు. ఈ అల్లర్లలో ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిశాయి. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, బంధు మిత్రులు ఆస్పత్రికి తరలించారు. బాగల్ కోటేలోని ఓ దవాఖానాలో చికిత్స అందిస్తున్నారు. గొడవలు చెలరేగిన కెరూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు ఆయన తన ఎస్కార్ట్ తో ఆస్పత్రికి వచ్చారు. వారిని పరామర్శించి, సాధక బాధకాలు తెలుసుకున్నారు.


ఒక్కో బాధితుడికి 50 వేలు..


గొడవలు జరిగిన తీరు గురించి ఆరా తీశారు. తర్వాత చికిత్స పొందుతున్న వారికి తన సొంత డబ్బు రూ. 50 వేలు అందించారు. తర్వాత ఘర్షణల్లో గాయపడిన ఓ వ్యక్తి సహా నలుగురి కుటుంబీకులను పరామర్శించిన సిద్ధ రామయ్య.. వారికి రూ. 2 లక్షలు పరిహారం అందించారు. తర్వాత ఆయన తిరుగు ముఖం పట్టిన క్రమంలో ఎవరూ ఊహించని ఘటన జరిగింది. సిద్ధరామయ్య తన ఎస్కార్ట్ కారు ఎక్కుతుండగా అక్కడికి గొడవలో గాయపడ్డ వ్యక్తి భార్య వచ్చింది. పరిహారంగా ఇచ్చిన రూ. 2 లక్షల నగదును సిద్ధరామయ్య పైకి విసిరేసింది. తమకు డబ్బులు వద్దని, న్యాయం కావాలని గట్టిగా అరిచి చెప్పింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


డబ్బు కాదు.. న్యాయం కావాలంటూ మహిళ గుస్సా..


మేము ఏ తప్పూ చేయలేదు. అయినా అకారణంగా మా వారిపై దాడి చేశారు. వారిని కొట్టి గాయపరిచారు. తీవ్రంగా గాయపడ్డ వారు ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాలి. మాకు ఎదురైన సమస్యకు డబ్బు పరిష్కారం కాదు. భిక్షాటన చేసైనా మా కుటుంబాన్ని పోషిస్తాం. మాకు కావాల్సింది న్యాయం. అకారణంగా మా వారిని కొట్టిన వారిని శిక్షించాలి. అని ఆ మహిళ సిద్ధరామయ్య ముందు తన ఆవేదనను వెల్లగక్కింది.


మహిళ చేసిన ఈ పనిపై దిగ్భ్రాంతి చెందిన సిద్ధ రామయ్య తర్వాత ఆ మహిళ చెప్పిన దానిని సావధానంగా విని స్పందించారు.బాధితుల బాధను అర్థం చేసుకోవాలని కోరారు. దీన్ని రాజకీయం చేసే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు. అల్లర్లు జరగడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. బాధితులకు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నాయకులు సాయం చేయడం లేదని విమర్శించారు. తన సొంత డబ్బులు బాధితులకు పరిహారంగా ఇచ్చానని వెల్లడించారు.