Quality norms for electrical accessories: న్యూఢిల్లీ: మన దేశంలో ఎలక్ట్రిక్ మార్కెట్‌లో చైనా ఉత్పత్తుల (Chinese Products) విక్రయాలు అధికంగా జరుగుతుంటాయి. కానీ ఇందులో అధికంగా నాసిరకం ఎలక్ట్రిక్ ఐటమ్స్ (Electrical Items) ఉండటంతో ఇళ్లల్లో విద్యుత్ కు సంబంధించి అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. ఏదైనా షాపులో నాసిరకం ఎలక్ట్రిక్ ఐటమ్స్, క్వాలిటీ లేని కంపెనీల ఉత్పత్తులు విక్రయించినట్లయితే వారికి జరిమానాతో పాటు, జైలు శిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నారు.


నాసిరకం ఉత్పత్తులను అరికట్టేందుకు కొత్త నిబంధనలు..
నాణ్యత లేని వస్తువుల దిగుమతిని అరికట్టడంతో పాటు దేశంలో ఎలక్ట్రిక్ ఉత్పత్తుల తయారీని పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ స్విచ్, సాకెట్స్, కేబుల్స్ లాంటి  ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ పై ప్రభుత్వం తప్పనిసరి Bureau of Indian Standards (BIS) నాణ్యత నిబంధనలను జారీ చేసింది. ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ (క్వాలిటీ కంట్రోల్) చట్టం 2023లో ఈ జనవరి 1న కొత్త నిబంధనల్ని DPIIT జారీ చేసింది.


డీపీఐఐటీ నిబంధనల ప్రకారం ఆ ప్రొడక్ట్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గుర్తును కలిగి ఉండాలి. బీఐఎస్ మార్క్ లేని ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్‌ను ఉత్పత్తి చేయకూడదు. అలాంటి ఎలక్ట్రిక్ వస్తువులను దిగుమతి చేయడం, విక్రయాలు చేయకూడదని నిబంధనల్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ వెలువడిన 6 నెలల నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని డీపీఐఐటీ తెలిపింది. అయితే మన దేశంలో తయారైన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేయడానికి ఇలాంటి నిబంధనలు వర్తించవని స్పష్టం చేసింది.


BIS చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన వారికి మొదటి నేరానికి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్ష గానీ లేదా కనీసం రూ. 2 లక్షల జరిమానా విధించనున్నారు. రెండోసారి రూల్స్ ఉల్లంఘిస్తే ఆ జరిమానా కనీసం రూ. 5 లక్షలు విధిస్తారు. లేకపోతే విక్రయించిన వస్తువుల విలువ కంటే 10 రెట్ల వరకు జరిమానా విధించేందుకు నిబంధనల్లో మార్పులు చేర్పులు చేశారు. 


చిన్న పరిశ్రమలకు కొంచెం మినహాయింపు
చిన్న, కుటీర, మధ్య తరహా (MSME sector) పరిశ్రమలకు ప్రస్తుతానికి బీఐఎస్ మార్క్ తప్పనిసరి నుంచి సడలింపు ఇచ్చారు. చిన్న పరిశ్రమలకు 9 నెలలు, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కు 12 నెలల అదనపు సమయం ఇస్తున్నారు. 


ఎలక్ట్రిక్ వస్తువుల నాణ్యత పెంచడానికి, నాణ్యమైన ఉత్పత్తుల విక్రయాలకు తాజా నిబంధనలు దోహదం చేస్తాయి. సంబంధిత డిపార్ట్ మెంట్ ఆయా ఉత్పత్తుల నాణ్యతను పరిశీలిస్తుంది. తద్వారా దేశంలో నాణ్యమైన ఉత్పత్తుల తయారీతో పాటు వాటి ద్వారా సంభవించే అగ్నిప్రమాదాలు సైతం తగ్గుతాయని పేర్కొంది. స్మార్ట్ మీటర్లు, వెల్డింగ్ రాడ్లు, వంటసామాను, ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లు, వంటింట్లో వాడే కరెంట్ స్టవ్‌లతో సహా అనేక వస్తువులకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.