Wrestlers Vs Brij Bhushan Row: 



కోర్టులో విచారణ..


WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లను వేధించడమే కాకుండా బెదిరించాడన్న ఆరోపణలున్నాయి. దీనిపై పోలీసులు స్పందించారు. ఇది నిజమే అని తేల్చి చెప్పారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడకూడదని, నోరు మూసుకుని పడి ఉండాలని తీవ్రంగా హెచ్చరించినట్టు వెల్లడించారు. Rouse Avenue Court లో ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు కోర్టుకి ఈ వివరాలు వెల్లడించారు. బ్రిజ్ భూషణ్‌పై ఉన్న ఆరోపణల ఆధారంగా వివరాలన్నీ సేకరించిన ఢిల్లీ పోలీసులు వాటిని కోర్టులో ప్రవేశపెడుతున్నారు. "రెజ్లింగ్‌ కంటిన్యూ చేయాలంటే నోరు మూసుకోండి. నాకు కెరీర్‌ ఇవ్వడమే కాదు. నాశనం చేయడం కూడా తెలుసు" అని బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లకు వార్నింగ్ ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. Indian Penal Code (IPC)లోని సెక్షన్ 506 ప్రకారం భూషణ్‌పై చర్యలు తీసుకునేందుకు అవకాశముందని స్పష్టం చేశారు. బ్రిజ్ భూషణ్ ఆఫీస్‌కి కేవలం మహిళల్ని మాత్రమే అనుమతించే వాళ్లని చెప్పారు. మహిళా రెజ్లర్లు కాకుండా ఎవరు వచ్చినా వాళ్లను అనుమతించే వాళ్లు కాదని తెలిపారు. దీన్ని బట్టే బ్రిజ్ భూషణ్ వైఖరి ఏంటో అర్థం చేసుకోవాలని కోర్టుకి వివరించారు ఢిల్లీ పోలీసులు. ఇదే సమయంలో బ్రిజ్ భూషణ్‌ ఓ మహిళా రెజ్లర్‌ని బలవంతంగా కౌగిలించుకున్న ఘటననూ ప్రస్తావించారు. అలా వేధించి కేవలం ఓ తండ్రిలా హత్తుకున్నానని చెప్పాడని ఢిల్లీ పోలీస్ లాయర్‌ వాదించారు. ఈ విచారణకు బ్రిజ్ భూషణ్ కూడా హాజరవ్వాల్సి ఉన్నా ఆయన కోర్టుకి రాలేదు. గతేడాది జూన్‌లోనే ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 


భారత రెజ్లింగ్ సమాఖ్య  (Wrestling Federation of India) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Saran Singh) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 12ఏళ్ల పాటు రెజ్లింగ్ సేవలు అందించానని, క్రీడలతో తనకు ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నట్లు తెలిపారు. ఛైర్మన్ గా సుదీర్ఘకాలం పాటు భారత రెజ్లింగ్ సమాఖ్యకు సేవలు అందించానని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వెల్లడించారు. రెజ్లింగ్ వ్యవహారాలను కొత్తగా ఎన్నికైన సంజయ్ సింగ్ ప్యానెల్ చూసుకుంటుందని స్పష్టం చేశారు. భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన ప్యానెల్‌ను కేంద్రం సస్పెండ్ చేసిన రోజే, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెజ్లింగ్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. మరోవైపు భారత రెజ్లింగ్ సమాఖ్యపై వివాదం జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతనంగా ఎన్నికైన  భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్‌ను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.  యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ రెజ్లింగ్ పోటీలను నిర్వహించాల్సి ఉంటుంది. దానికి విరుద్ధంగా సంజయ్ సింగ్ ప్రకటన చేయడంతో కొత్త ప్యానెల్‌ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. 


Also Read: Lakshadweep Tourism: లక్షద్వీప్‌కి ఇన్ని స్పెషాల్టీస్ ఉన్నాయా? అందుకే ప్రధాని ప్రమోట్ చేశారా?